అవసరం మేరకే ఏర్పాట్లు

9 Jul, 2014 23:58 IST|Sakshi
అవసరం మేరకే ఏర్పాట్లు

 సాక్షి, రాజమండ్రి : అనుకున్నదొకటి... అయ్యిందొకటి... గోదారమ్మకు పుష్కరాలు సందర్భంగా రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు మహర్దశ పడుతుందన్న పలువురి ఆశలపై దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ నీళ్లు జల్లారు. కేవలం అదనపు రద్దీని తట్టుకునేందుకు మాత్రమే ఏర్పాట్లు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తమశాఖ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోందని ఆయన తేల్చి చెప్పారు. టౌన్‌స్టేషన్‌లో అదనంగా రెండు ప్లాట్‌ఫాంలు, ట్రాక్‌లు, తూర్పు రైల్వే స్టేషన్ మరిం త అభివృద్ధి, గోదావరి స్టేషన్‌కు మరోకొత్త ప్లాట్ ఫాం, కొత్తలైను, అదనపు హంగులు వంటివి పుష్కరాల నేపథ్యంలో శాశ్వత ప్రాతి పదికన రైల్వేస్టేషన్లకు దక్కుతాయని ప్రజాప్రతినిధులు ఊహించారు. వాటికి బ్రేక్ వేస్తూ వా త్సవ స్పందించారు. వచ్చే సంవత్పరం జరగబోయే గోదావరి పుష్కరాలను ఎదుర్కొనేం దుకు చేపట్టాల్సిన పనులపై బుధవారం ఆయ న రాజమండ్రి వచ్చారు. టౌన్, గోదావరి రైల్వేస్టేషన్లను పరిశీలించారు. అదనపు రద్దీని ఎదుర్కొనడానికి ఏవేమి సదుపాయాలు కావాలో వాటినే ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అదనపు హంగులకు తమ వద్ద నిధులు లేవని ఆయన పేర్కొన్నారు.
 
 ప్రయాణికులకు ఇబ్బంది రానివ్వం
 పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని శ్రీవాత్సవ పేర్కొన్నారు. రద్దీకి తగ్గట్టుగా అదనపు బుకింగ్ కౌంటర్లు, మరుగుదొడ్లు, తాత్కాలిక ప్రాతిపదికన ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేస్తామన్నారు. కొంత రద్దీని తూర్పు ప్రాంత రైల్వేస్టేషన్ నుంచి మళ్లించేందుకు రోడ్డు వెడల్పు వంటి అంశాలను ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నారు. అవసరమైతే తమ స్థలాన్ని విస్తరణకు ఇస్తామని హామీ ఇచ్చారు.
 
 ఎమ్మెల్యేల అసంతృప్తి
 కాగా రైల్వేస్టేషన్‌లో ప్లాట్ ఫాంలు శాశ్వత ప్రాతిపదికన విస్తరించాలంటే అదనపు నిధులు అవసరమన్నారు. శాశ్వత విస్తరణ దిశగా జీఎం ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఆయనను కలిసిన ప్రజాప్రతినిధులు నిరుత్సాహానికి గురయ్యారు. బడ్జెట్‌లో తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని,  పుష్కర పనుల్లో కూడా ఇలాగైతే ఎలా అని రాజమండ్రి రూరల్, సిటీ ఎమ్మెల్యేలతో పాటు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు ఎమ్మెల్యేలు జీఎం ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
 జీఎం పర్యటన సాగిందిలా....
 దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ హైదరాబాద్ నుంచి ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో రాజమండ్రి చేరుకున్నారు. ముందుగా డీఆర్‌ఎం ప్రదీప్‌కుమార్ ఇతర వివిధ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.  తొమ్మిది గంటలకు టౌన్‌స్టేషన్‌లోని మొదటి, రెండో ప్లాట్ ఫాంలను  పరిశీలించారు. అక్కడి నుంచి తూర్పు రైల్వే స్టేషన్‌కు చేరుకుని మూడో ప్లాట్ ఫారం నుంచి తూర్పు స్టేషన్ మధ్యలో తాత్కాలిక ప్రాతిపదికన కొత్తగా ప్లాట్ ఫారాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించారు. దిగిన ప్రయాణికులు మొదటి ప్లాట్ ఫాంకు ఎలా వెళ్లాలి, ఫుట్ ఓవర్ ప్లాట్ ఫాంలు ఎక్కడ వేయాలి అనే విషయాలను స్థానిక అధికారులు జీఏంకు వివరించారు. తూర్పు రైల్వేస్టేషన్ వద్ద అదనంగా మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలతో పాటు, ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. రైలు దిగిన తర్వాత ప్రయాణికులు నేరుగా బయటకు వచ్చేందుకు మెట్లు, అడ్డంకులు లేని విధంగా ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
 
 గోదావరి కీలకం
 గోదావరి స్టేషన్ నుంచి పుష్కర్‌ఘాట్ సహా పలు స్నానఘట్టాలు అతి దగ్గరలో ఉన్నందున సాధారణ ప్రయాణికులు ఇక్కడ దిగేలా ఏర్పాట్లు చేయాలని జీఏం అధికారులను కోరారు. టౌన్‌స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో గోదావరి స్టేషన్‌కు చేరుకున్న శ్రీవాత్సవ అక్కడి ఏర్పాట్లపై కూడా పలు సూచనలు చేశారు.  స్టేషన్‌లో ఉన్న ఖాళీ స్థలం వినియోగించుకుని సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కోటగుమ్మం వైపున ఉన్న మార్గాన్ని పుష్కరాలకు ప్రధాన ముఖ ద్వారంగా అభివృద్ధి చేస్తే ప్రజలు కాలినడకన నేరుగా స్నానఘట్టాలకు వెళ్లిపోయే వీలుంటుందన్నారు. ఇదే ప్రాంతంలో అదనంగా మరుగుదొడ్లు, మంచినీరు, ఆహార పదార్థాల విక్రయ స్టాళ్లు ఏర్పాటు చేయాన్నారు. అవసరమైనన్ని బుకింగ్ కౌంటర్లు ఉండేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
 
 జీఎంను కలిసిన నేతలు
 వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టౌన్‌స్టేషన్‌లో జీఎంను కలసి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన చేపట్టాలని కోరారు. రాజమండ్రి నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యే కె.ఎస్.జవహర్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా కలుసుకుని పుష్కర పనులపై వినతులు చేశారు. జీఎం వెంట సికింద్రాబాద్ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు చీఫ్ కమర్షియల్ మేనేజర్ జేపీ షా, చీఫ్ ఆపరేషన్ మేనేజర్ లక్ష్మీనారాయణ, విజయవాడ డివిజన్‌లోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు, రాజమండ్రి టౌను, గోదావరి స్టేషన్ సూపరింటెండెంట్‌లు బీసీహెచ్ శాస్త్రి, జి.వాసు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు