కోట శ్రీనివాసరావు బర్త్‌డే

9 Jul, 2014 23:45 IST|Sakshi
కోట శ్రీనివాసరావు బర్త్‌డే

ఇక్కడ సంతృప్తి వెతుక్కోవడం అమాయకత్వం..!
 
విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ కోట శ్రీనివాసరావు. 36 ఏళ్ల నట ప్రస్థానంలో ఆయన చేసిన వైవిధ్యమైన పాత్రలు ఎన్నో. నేడు ఆయన    పుట్టిన రోజు. ఈ సందర్భంగా కోటతో ‘సాక్షి’ జరిపిన సంభాషణ.
 
ఆరోగ్యం ఎలా ఉంటోందండీ...
బాగానే ఉంటుంది. అయితే... వయసు మీద పడుతోంది కదా... కీళ్ల నొప్పులు.

ఇదివరకు చేసినంత ఉత్సాహంగా సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా?
కొంతవరకు కరెక్టే. అయినా... ఈ వయసులో నాకు పరుగెత్తే వేషాలు ఇవ్వరు కదా. ఇప్పుడు స్టార్లుగా చలామణీ అవుతున్న కుర్రహీరోలకు తాతయ్యగానో, లేక బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి సీనియర్లకు బాబాయిగానో, తండ్రిగానో వేషాలు ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఓ అరడజను సినిమాలు చేతిలో ఉన్నాయి. అయితే... వాటి పేర్లు మాత్రం అడక్కండి. ఎందుకంటే... నాకు గుర్తుండవు.

మీ స్థాయికి తగ్గ పాత్రలు ఇప్పుడు వస్తున్నాయంటారా?
నాకు తెలిసి ఈ తరంలో నాకు దక్కిన అదృష్టం ఎవరికీ దక్కలేదు. నా 36 ఏళ్ల సినీ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ ఎన్నో మంచి పాత్రలు పోషించాను. ఇక ఇప్పుడు చేస్తున్న పాత్రలు అంటారా! వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను. ఎందుకంటే... కథల్ని ఎంచుకునే తీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నేటివిటీతో పనిలేదు. సంస్కృతి, సంప్రదాయాలతో నిమిత్తం లేదు. ప్రతి సినిమాలో ఒకే తరహా పాత్రలు. ఇలాంటి సందర్భంలో సంతృప్తి కోసం వెతుక్కోవడం అమాయకత్వం. అందుకే భుక్తి కోసం నటిస్తున్నా.
 
ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు కదా. ఇంకా చేయాల్సిన పాత్రలు ఏమైనా ఉన్నాయా?
సమకాలీన సమాజం నుంచి రోజుకొక కొత్త పాత్ర పుట్టుకొస్తోంది. ఆ రకంగా చూస్తే చేయాల్సిన పాత్రలు కోకొల్లలు. ఇదివరకు పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం, కౌబాయ్ ఇలా అయిదు రకాల సినిమాలుండేవి. ఇప్పుడలా కాదు. సాధ్యమైనంతవరకూ అన్నీ సమకాలీన కథాంశాలే. ఇలాంటి సందర్భాల్లోనే నటునికి పరిశీలనాత్మక దృష్టి అవసరం. రోడ్డు మీదకెళ్లి నిలబడితే... రకరకాల పాత్రలు కనిపిస్తాయి. అంతెందుకు కాసేపు అసెంబ్లీని చూడండి.. మీకు భిన్నమైన మేనరిజాలు వినిపిస్తాయి. ఇవన్నీ కొత్త కొత్త పాత్రలే. నా దృష్టిలో ప్రపంచంలో పాత్రలకు కొరత లేదు. మహానటుడు ఎస్వీఆర్ కూడా అన్ని పాత్రలూ చేయలేదు. చేయగలిగినన్ని చేసి నిష్ర్కమించారు. నేనూ అంతే.
 
తెలుగు నేలపై ఉన్న యాసలన్నీ అనర్గళంగా మాట్లాడేస్తారు. ఎలా నేర్చుకున్నారు?
నాకు ప్రతిదీ అబ్జర్వ్ చేయడం అలవాటు. అలాగే యాసలన్నీ నేర్చుకున్నాను. రాయలసీమకు చెందిన పాత్ర చేశాననుకోండి. డబ్బింగ్ థియేటర్లో, రాయలసీమకు సంబంధించిన వాళ్లను పక్కన పెట్టుకొని డబ్బింగ్ చెబుతా. అలాగే తెలంగాణ... శ్రీకాకుళం... గోదావరి.. ఇలా అన్ని మాండలికాలే.
 
కానీ, మీరలా మాట్లాడుతుంటే మా యాసను, భాషను గేలి చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయిగా?

చూడండీ... ‘ఇది నా భుక్తి’ అనుకుంటే ఫర్లేదు. కానీ.. ‘ఇది నా బిజినెస్’ అనుకుంటేనే సమస్యలన్నీ.     ఈ విషయంలో నటీనటులకు వచ్చిన భయమేం లేదు. కథను బట్టి, పాత్ర చిత్రణను బట్టి మా నటన ఉంటుంది. నా వరకు నేను మాట్లాడే ఏ యాస అయినా... వినోదభరితంగా ఉంటుంది తప్ప, అవమానకరంగా ఉండదు.
 
మెగాఫోన్ పట్టుకోవాలని ఎప్పుడూ అనిపించలేదా?
ఎవడు చేసే పని వాడు చేయాలి. అనవసరపు రిస్క్ ఎందుకు? నాకు తెలిసింది నటన. అంతే.

మనవళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా?
వాళ్లు చిన్న పిల్లలు. ఒకడు ఏడు, ఇంకొకడు మూడు చదువుతున్నారు.
 
రావుగోపాలరావు వారసుడు కోట అంటారు చాలామంది. మరి మీ వారసుడు ఎవరంటే?
మీరే చెప్పండి? మేం చెప్పలేం సార్...
 నేనెలా చెప్పగలను. గోపాలరావుగారి తరహా పాత్రలు నేనూ చాలా చేశాను. కానీ.. నా తరహా పాత్రలు చేసి మెప్పించే నటులు కనిపించడం లేదే! అదే నా బాధ.
 
రావుగోపాలరావుగారితో మీ అనుబంధం ఎలా ఉండేది?
అయనతో ఓ పది సినిమాల దాకా పనిచేశాను. నేనంటే ఆయనకు ఎంతో అభిమానం. ‘నీ డైలాగ్ ఫైరింజన్ గంట మోతలా ఉంటుందయ్యా..’ అనేవారు. నిజానికి ఆయన డైలాగ్ ఓ అద్భుతం. నన్ను అలా మెచ్చుకోవడం గోపాలరావుగారి సంస్కారం. ఓ సందర్భంలో ‘నాగభూషణం, రావుగోపాలరావు కలిస్తే కోట’ అని కాంప్లిమెంట్ ఇచ్చారాయన.
 
‘మండలాధీశుడు’లో ఎన్టీఆర్ పాత్ర చేశారు కదా. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?
అదో చేదు అనుభవం. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. అయితే... ఎన్టీఆర్‌గారు మహానుభావుడు. ‘బాగా నటించారు బ్రదర్’ అని అభినందించారు. ఎన్టీఆర్ గారితో నటించలేకపోవడం నా జీవితంలో ఒకే ఒక్క లోటు. ‘మేజర్ చంద్రకాంత్’లో చేయాల్సింది. కానీ.. చివరి నిమిషంలో ఆ పాత్ర పరుచూరి గోపాలకృష్ణ చేశారు.
 
మీరు చాలామందికి ఇష్టమైన నటుడు, మరి మీకు ఇష్టమైన నటుడు?

ఎస్వీరంగారావు గారు. ఆయన పేద వేషాలేసినా... ఆయనలో రాజసం కనిపిస్తుంది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు జనాలు. తర్వాత తరానికి దొరికిన గొప్ప నట గ్రంథాలయం ఆయన.