వీరే మన 'పెద్దలు'

7 Feb, 2014 19:59 IST|Sakshi
వీరే మన 'పెద్దలు'

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఊహించినట్టే వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ. ఖాన్.. టీడీపీ తరపున గరికపాటి మోహనరావు, సీతామహాలక్ష్మి, టీఆర్ఎస్ తరఫున కె.కేశవరావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు, టీడీపీ అభ్యర్థులు ఇద్దరు తొలి ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు.  కాగా 26 ఓట్లు సాధించిన కేశవ రావు ఎలిమినేషన్ ప్రక్రియలో విజయం సాధించడం లాంఛనమే. వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సివుంది.
 

రాష్ట్రం నుంచి ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా ఏడుగురు బరిలో నిలిచారు.  చిట్టచివరి నిమిషంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తప్పుకోవడంతో ఆరుగురి ఎన్నిక కావడం ఖాయమని ముందుగానే తేలిపోయింది. నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగియడంతో సాంకేతికంగా ఆదాల పోటీలో ఉన్నా.. మిగిలిన అభ్యర్థులే ఓట్లు పంచుకున్నారు. దీంతో వీరి ఎన్నిక లాంఛనమైంది.  ఓటింగ్ లో మొత్తం 248 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల ఖాళీ బ్యాలెట్ పేపర్ను బాక్సులో వేయగా, మరో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా తిరస్కార హక్కును వినియోగించుకున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ వారే.
 

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీపీఎం సభ్యులు ఓటింగులో పాల్గొనలేదు. కాంగ్రెస్ తరపున ముగ్గురూ సిట్టింగ్ అభ్యర్థులే ఎన్నికయ్యారు. వీరికి మరోసారి రాజ్యసభ అవకాశం దక్కింది. ఇక టీఆర్ఎస్ నేత కేశవరావు కూడా రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతంలో కాంగ్రెస్ తరపున అవకాశం వచ్చింది. అయితే కాంగ్రెస్ తో విభేదించి రాజీనామా చేసిన కేకే టీఆర్ఎస్ లో చేరారు. ఇక టీడీపీ తరపున గెలిచిన గరికపాటి, సీతామహాలక్ష్మి ఇద్దరూ కొత్తవారు.
 

>
మరిన్ని వార్తలు