‘రియల్’ ఆక్రమణలు

27 Jan, 2014 00:10 IST|Sakshi

తూప్రాన్, న్యూస్‌లైన్:  తూప్రాన్ మండలంలో భూ దందా జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇక్కడి భూములకు రెక్కలు వచ్చాయి. లక్షల విలువచేసే ప్రభుత్వ, అసైన్డ్ భూము లు అన్యాక్రాంతమవుతున్నాయి. ధనబలం, రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ భూములను అక్రమించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికోడుతున్నారు. తూప్రాన్ మండలంలో 44వ జాతీయ రహదారి సుమా రు 20 కిలోమీటర్ల పొడవుగా ఉంటుంది. అంతేకాకుండ రైల్వే సదుపాయం కూడా ఉండడంతో ఇక్కడి భూములు రియల్ భూం కొనసాగిన రోజుల్లో ఎకరం కోటి రూపాయల వరకు పలికింది.

 కొన్ని నెలలు స్తబ్ధుగా ఉన్న రియల్ వ్యాపారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో తిరిగి ఊపందుకుంది. దీంతో ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ రియల్టర్లు వాలిపోతున్నారు. వెంచర్లుగా మారుస్తున్నారు. తూప్రాన్ మండలంలోని కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, కూచారం, జీడిపల్లి, మనోహరాబాద్, అల్లాపూర్, రామాయిపల్లి, ఇస్లాంపూర్ తదితర గ్రామాల్లోని కోట్ల విలువైన భూములు అక్రమార్కుల కబంధహస్తల్లో చిక్కుకున్నాయి. చెరువులు, కుంటల శిఖం భూములు, మాజీ సైనికోద్యుగులకు ఇచ్చిన భూముల అన్నీ కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వారి అండదండలతోనే  ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు లేకపోలేదు.

 నిబంధనలకు తూట్లు
 తూప్రాన్ మండలం హైదరాబాద్ నగరానికి సమీపం దూరంలోనే ఉండడంతో హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఎలాంటి భూ లావాదేవిలు జరుపలాన్నా, వెంచర్లు ఏర్పాటు చేయాలనన్నా ముం దుగా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే కొందరు  రియల్ వ్యాపారులు వెంచర్లు ఏర్పాటు చేసి నిబంధనలను తుంగలో తొక్కతున్నారు.

  పంచాయతీ అనుమతి లేకుండా, టౌన్ ప్లానింగ్ నిబంధనలు పాటించకుండా, లే అవుట్ కాకుండానే ఇష్టారాజ్యంగా ప్లాట్లను ఏర్పాటు చేస్తున్నా రు. పంచాయతీ రాజ్ చట్టం-67 ప్రకారం గ్రామ పంచాయతీ అనుమతి తీసుకుని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బెటర్‌మెంట్ చార్జీలు చెల్లిస్తూ, పంచాయతీకి డెవలప్‌మెంట్ ఫండ్ కింద 10 శాతం కట్టాలి. అనంత రం నాలా(వ్యవసాయేతర భూములుగా) ఆర్డిఓ నుంచి అనుమతులు పొందాలి. అప్పుడేు ఈ ప్లాట్లను విక్రయించాలి. కానీ ఈ నిబంధనలు గాలికొదిలేస్తున్నారు.

 తూప్రాన్ మండలంలో అన్యాక్రాంతమైన భూముల్లో మచ్చుకు కొన్ని...
     తూప్రాన్ మండలం మనోహరాబాద్ గ్రామ సమీపంలో వెంచర్‌లోని సర్వే నంబర్ 67, 71, 74, 105, 108లలో 10.20 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేశారని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
     మనోహరాబాద్ గ్రామానికి పక్కన ఏర్పాటు చేసిన వెంచర్‌లోని సర్వే నంబర్ 548లో .22 గుంటల ప్రభుత్వ భూమి, పురాతర దేవత విగ్రహాల తొలగింపు, చెరువుకు చెందిన చిన్నకాలువ పూడ్చివేత, గ్రామానికి అనుకొని ఉన్న 12 ఫీట్ల రోడ్డును అక్రమించి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

     ఇస్లాంపూర్ గ్రామ సమీపంలో సర్వే నంబర్ 14లో ఓ రియల్ వ్యాపారి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమించాడు. అయితే ఆ భూమిని ఓ మాజీ సైనికోద్యోగునికి ఇచ్చారని, అది తాము కొనుగోలు చేసినట్లు సదరు వ్యాపారి గ్రామస్తులకు వివరించారు. అయితే  గ్రామస్తులు ఆందోళన చేయడంతో స్పందించిన  రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించగా సైనికునికి ఇచ్చిన స్థలం మరో చోట ఉందని గుర్తించారు.

     కూచారం గ్రామ సమీపంలోని గ్రీన్ విల్లా పేరుతో 14 ఎకరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు తెలిపారు. కాళ్లకల్ గ్రామ సమీపంలో 22 ఎకరాల్లో ఏర్పాటైన వెంచర్‌కు అనుమతులు లేవు.

మరిన్ని వార్తలు