పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం

1 Oct, 2017 13:20 IST|Sakshi

ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో లక్ష్యాన్ని మించి రాబడి

మొదటి ఆరునెలల్లో 7,48,860 రిజిస్ట్రేషన్లు నమోదు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం(2017–18)లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది. నిజానికి ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాబడిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెనుకబడింది. అయితే ద్వితీయ త్రైమాసికం చివరికొచ్చేసరికి లక్ష్యాన్ని మించి పదిశాతం అధిక రాబడిని సాధించింది. మొత్తంమీద ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ.1,950 కోట్ల ఆదాయం సాధించాలనేది లక్ష్యం కాగా రూ.2,155.77 కోట్ల రాబడి వచ్చింది. లక్ష్యంతో పోల్చితే రాబడి 110.55 శాతం కావడం విశేషం.

రూ.326.68 కోట్లతో రాబడిలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఈ జిల్లా నుంచి రూ.308.08 కోట్ల ఆదాయ లక్ష్యం కాగా రూ.326.68 కోట్లు(106.04 శాతం) సాధించింది. రూ.55.54 కోట్ల రాబడితో శ్రీకాకుళం జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. అయితే రూ.45.11 కోట్ల ఆదాయ లక్ష్యంతో పోల్చి చూస్తే మాత్రం ఇక్కడ 23 శాతం అధిక రాబడి రావడం గమనార్హం.

భారీగా రిజిస్ట్రేషన్లు
గతంలో రాష్ట్రంలో నెలకు సగటున లక్ష రిజిస్ట్రేషన్లు జరిగేవి కాగా.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో మాత్రం 7,48,860 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 99,456 రిజిస్ట్రేషన్లతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించి 28వ తేదీ వరకు రాష్ట్రంలో 1,00,493 రిజిస్ట్రేషన్లు జరగ్గా, ఇందులో 15,545 రిజిస్ట్రేషన్లతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, 6,238 రిజిస్ట్రేషన్లతో అనంతపురం జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. 

>
మరిన్ని వార్తలు