ప్రత్యామ్నాయం చూపాలి

22 Oct, 2014 02:10 IST|Sakshi
ప్రత్యామ్నాయం చూపాలి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే పొగాకు నిషేధంపై ఆలోచించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ను కోరారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రతినిధులతో కలిసి మంగళవారం ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. పొగాకు ఉత్పత్తులపై కేంద్రం తీసుకురానున్న బిల్లుపై వారు మంత్రితో చర్చించారు. కేంద్రం నిర్ణయం తీసుకునే సమయంలో ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలు కూడా గమనంలోకి తీసుకోవాలని కోరారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పొగాకు ఎక్కువగా పండుతుందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

పొగాకుకు ప్రత్యామ్నాయంగా శనగలు, తదితర పంటలను ముందుకు తీసుకువచ్చినా వాటి వల్ల రైతాంగం నష్టపోయిన సంగతి గుర్తు చేశారు. పొగాకు వాడకం వల్ల కేన్సర్ వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి హర్షవర్ధన్ ప్రస్తావించారు.దీనిపై ఎంపీతో పాటు రైతుల ప్రతినిధి బృందం స్పందిస్తూ దీనికి తాము ఏకీభవిస్తామని, అదేసమయంలో లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా చర్యలు తీసుకుంటేనే రైతులను ఆ పంటలు వేసుకునే విధంగా ప్రోత్సహించే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకునే సమయంలో దీని గురించి ఆలోచించాలని కోరారు.  ప్రతినిధి బృందంలో పొగాకు రైతు ప్రతినిధులు పీవీ సత్యనారాయణ రెడ్డి, ఆర్ నరేంద్ర,  గద్దె శేషగిరిరావు, వెంకటరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు