ప్రతీకారంతోనే హత్య

18 Aug, 2019 11:36 IST|Sakshi

విద్యార్థి హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఏడుగురు నిందితుల అరెస్ట్‌

లా అండ్‌ ఆర్డర్‌ ఏఎస్పీ అనిల్‌ బాబు

సాక్షి, తిరుపతి: సంచలనం కలిగించిన విద్యార్థి హత్య కేసును  అలిపిరి పోలీసులు ఛేదించారు. శనివారం తిరుపతిలోని అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లా అండ్‌ ఆర్డర్‌ ఏఎస్పీ అనిల్‌ బాబు తెలిపిన వివరాలు.. వైఎస్సార్‌ జిల్లా కోడూరు మండలంఓబులవారిపల్లె చెందిన పి. ద్వారకనాథ్‌(21) చదలవాడ కళాశాలలో బీబీఏ ఆఖరు సంవత్సరం చదువుతున్నాడు. ఇతను స్థానిక శెట్టిపల్లెలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అతనికి సమీప బంధువైన అశోక్‌ ఒకే గ్రామానికి చెందిన వారు. వీరితోపాటు అదే గ్రామానికి చెందిన కార్తీక్‌(19) ఎం.ఆర్‌. పల్లెలోనిఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ వెస్ట్‌ చర్చ్‌ సమీపంలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గతనెల 25న అశోక్‌ తన గ్రామానికి చెందిన నాగబ్రహ్మయ్య అలియాస్‌ బబ్లూకు ఫోన్‌ చేసి తన తండ్రికి షుగర్‌  మాత్రలు తీసుకోవాలని ఫోన్‌ చేశాడు.

అయితే ఆ ఫోన్‌ కాల్‌ను కార్తీక్‌ రిసీవ్‌ చేసుకున్నాడు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న కార్తీక్‌కు, అశోక్‌కు మధ్య ఫోన్లో వాగ్వాదం చోటుచేసుకోవడంతో కార్తీక్, అశోక్‌ను తీవ్రంగా దూషించాడు. దీంతో అశోక్‌ తన బంధువైన ద్వారకనాథ్‌కు ఫోన్‌ చేసి జరిగిన ఉదంతాన్ని తెలిపాడు. వెంటనే అతను కార్తీక్‌ గదికి వెళ్లి అతన్ని మందలించాడు. దీంతో అతనిపై  కార్తీక్‌ కక్ష పెంచుకున్నాడు. ద్వారకనాథ్‌ను హతమార్చాలని స్కెచ్‌ వేశాడు. ఈనెల 5వ తేదీ రాత్రి శెట్టిపల్లె రైల్వే క్రాసింగ్‌ లైన్‌ సమీపంలోని బస్టాండ్‌ వద్దకు వచ్చి మాట్లాడాలని ద్వారకనాథ్‌ను పిలిపించా డు. ఓ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజుతో పాటు తిరుపతికి చెందిన అఖిల్, భరత్‌ కుమార్‌ తన గ్రామానికి చెందిన విద్యార్థులు రోహిత్, జగదీష్, నాగబ్రహ్మయ్య అలియాస్‌ బబ్లూ, చెంగయ్య, శివకృష్ణారెడ్డితో కలిసి బీరు బాటిళ్లతో ద్వారకానాథ్‌పై దాడి చేశారు. అతడి తలపై మోది వాటితోనే పొడిచి హత్య చేశారు.

అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై హతుడి బావ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అలిపిరి సీఐ సుబ్బారెడ్డి నిందితులను మంగళం కూడలి వద్ద శనివారం అరెస్టు చేశారు. వారిలో నాగరాజు, అఖిల్‌ ప్రస్తుతం పరా రీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.  కేసును ఛేదించడంలో ఎస్‌ఐలు షేక్‌షావలి, వినోద్‌కుమార్, హెచ్‌సీలు కామరాజు, చిరంజీవులు, వసంతకుమార్, పీసీలు నాగరాజు, కుమార్‌రాజా, రాజశేఖర్‌ ప్రత్యేక  చొరవ చూపారని, వీరందరికీ రివార్డులు వచ్చేలా ఎస్పీకి సిఫారసు చేస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు