రేవతి పరిస్థితి విషమం

20 Dec, 2013 03:07 IST|Sakshi

 పిఠాపురం/కాకినాడ మెయిన్ రోడ్డు, న్యూస్‌లైన్ :
 పిఠాపురంలో బుధవారం ప్రేమోన్మాది ఘాతుకంతో అగ్నికీలల్లో చిక్కుకున్న రేవతి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 75 శాతం శరీరం కాలిన ఆమెను గురువారం ఉదయం వరకూ కాకినాడ ప్రభుత్వాస్పతిలోని మెడికల్ ఐసీయూలో ఉంచి సర్జికల్ విభాగం అధిపతి డాక్టర్ బాబ్జీ చికిత్స అందించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో సర్జికల్ ఐసీయూలోని బర్న్స్ వార్డుకు తరలించారు. రెండు వారాల చికిత్స అనంతరం కాని ఆమె ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట బుద్ధ చెప్పారు. ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వాస్పత్రిలో అందుబాటులో లేని మందులను బయట నుంచి తీసుకువచ్చి ఆమె కోలుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ సర్జరీ అవసరమా, లేదా అన్నది పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ సర్జన్‌లు వచ్చి ఆమెను పరిశీలించారు. ఎలాగైనా కూతురిని తమ దక్కించాలని రేవతి తల్లిదండ్రులు చేతులు జోడించి వైద్యులను అభ్యర్థిస్తున్నారు. మెరుగైన వైద్యసేవలందించి, ఆమె ప్రాణం కాపాడాలని కన్నీళ్లతో మొర పెట్టుకుంటున్నారు. మరోవైపు పిఠాపురం సీఐ ఎస్.రాంబాబు గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. ప్రేమోన్మాది నవీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చడానికి సన్నద్ధమవుతున్నారు.
 
 పేదరికాన్ని గెలవాలనుకుంది..
  రేవతి తండ్రి శంకర్‌బాబు కారు మెకానిక్. ఏ రోజు కష్టార్జితంతో ఆ రోజు గడుపుకొనే ఆ పేద కుటుంబంలో రెండో బిడ్డగా పుట్టిన రేవతి ఒక టో తరగతి నుంచీ ప్రథమ శ్రేణిలో నిలుస్తోంది. పెద్ద చదువు చదివి, మంచి ఉద్యోగం సంపాదించాలని, తద్వారా పేదరికాన్ని జయించాలనే పట్టుదలతో ఉండేదని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. పెద్ద కుమార్తెకు అతి కష్టం మీద వివాహం జరిపించామని, చిన్న కుమార్తెకు చదువు పూర్తయ్యాక ఉన్నంతలో ఘనంగా వివాహం జరిపించాలని ఆశించామని రేవతి తల్లిదండ్రులు అంటున్నారు.  ఇంతలోనే ఆ దుర్మార్గుడి కారణంగా పెళ్లి నిశ్చయించాల్సి వచ్చిందని చెపుతున్నారు. కుమార్తె తాను ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలబడ్డాకే   పెళ్లి చేద్దురు గాని అనేదని గుర్తు చేసుకుంటూ గొల్లుమంటున్నారు. నాలుగు రోజుల్లో మధుపర్కాలు కట్టుకోవలసిన తమ బిడ్డను మంటల పాలు చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పిఠాపురంలో రేవతి కుటుంబం నివసించే వేణుగోపాలస్వామి వీధిలోని వారు ఆమె కోలుకోవాలని స్వామికి మొక్కుతున్నారు.
 
 బడికి వెళ్లాలంటేనే భయమేస్తోంది..
 ప్రేమోన్మాదుల వల్ల  రోజూ భయంతో బడికెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నవీన్ రోజూ రేవతిని బడికెళ్లేటపుడు ఏడిపించేవాడు. ఇంట్లో చెబితే చదువు మానిపించేస్తారని బాధపడేది. బాలికోన్నత పాఠశాల అయినా రక్షణ లేకపోవడంతో పోకిరీల ఆగడాలు మితిమీరి చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. బాలికలకు రక్షణ కల్పించకపోతే బడికెళ్లడం బతుకుపై ఆశ వదులుకోవడమే అవుతుంది. నిందితుడు నవీన్‌ను కఠినంగా శిక్షించి మా స్నేహితురాలు రేవతిని కాపాడండి.
 - స్వాతి, రేవతి క్లాస్‌మేట్
 
 చదువు కోసం.. పరువు కోసం..
  ఇలా దాడులు జరితే మేము చదువుకునేదెట్లా?  గంపెడాశతో తల్లిదండ్రులు మ మ్మల్ని బడికి పంపిస్తుంటే  మృగాళ్లు మా జీవితాలతో ఆడుకుం టున్నారు. ప్రేమ పేరు తో వేధిస్తున్నారు.   పరువు కోసం మా తల్లిదండ్రులు, చదువుకోసం మేము బాధలను దిగమింగి జీవితాలను సాగిస్తున్నాము. ఇప్పటికైనా మా స్నేహితురాలికి పట్టిన గతి మరెవరికీ పట్టకుండా రక్షణ చర్యలు చేపట్టండి.
 - సోనియా, రేవతి క్లాస్‌మేట్
 
 

మరిన్ని వార్తలు