ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్‌ భార్య ప్రసవం 

9 Nov, 2023 03:45 IST|Sakshi

మగబిడ్డ జననం..తల్లీబిడ్డ క్షేమం 

ఆదర్శంగా నిలిచిన కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ 

పార్వతీపురం: ఆయన ఆ జిల్లాకే ప్రధాన అధికారి. ఆయన తలచుకుంటే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందగలరు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న మెరుగైన వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. ధైర్యంగా తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మరెవరో కాదు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌.

వివరాల్లోకి వెళితే...పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ భార్య కరుణ బుధవారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బి.వాగ్దేవి, వైద్యులు త్రివేణి, చిన్నపిల్లల వైద్యుడు బి.గణేష్‌ చైతన్య వైద్యసేవలందించి సుఖప్రసవం చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.

కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ గతంలో రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేసిన సమయంలో అక్కడి సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలోనే ఆయన భార్య తొలి సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అలాగే పార్వతీపురంలో పనిచేసిన జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ భార్య కూడా ఇటీవల 108 వాహనంలో వెళ్లి పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలోనే మగబిడ్డకు జన్మనిచి్చన సంగతి తెలిసిందే.   

మరిన్ని వార్తలు