ఆదాయ, ఖర్చుల నమోదుకే ఈ–ఫైలింగ్‌

23 Mar, 2018 13:05 IST|Sakshi

నిడమర్రు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయం, ఖర్చులను ఎప్పటికప్పుడు మదింపు చేయడం కోసం ఉద్దేశించిన విధానమే ‘ఈ–ఫైలింగ్‌’. పన్ను వర్తించే ఆదాయం ఉన్నవారు జులై 31లోగా ఆదాయపన్ను రిటర్న్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి నెలలో సమర్పించిన ఫారం–16 ఆధారంగా రిటర్న్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ–ఫైలింగ్‌ను పాన్‌ కార్డు నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఈ–ఫైలింగ్‌ ద్వారా తమ ఆదాయ వ్యయాలను ఆదాయపన్ను శాఖకు సులభంగా తెలిపేందుకు ఉపయోగపడే ఒక సాధనంగా పేర్కొనవచ్చు. ఈ–ఫైలింగ్‌కు సంబంధించి ముఖ్య సమాచారం తెలుసుకుందాం.

జులై 31వ తేదీలోపు
ఈ–ఫైలింగ్‌ ఈ ఏడాది జులై 31లోగా ఎలాంటి పెనాల్టీ లేకుండా పర్సనల్‌ ఈ–ఫైలింగ్‌ చేసుకోవచ్చు.
ఒకవేళ ఉద్యోగుల ఆదాయం మొత్తం రూ.5 లక్షల లోపు ఉండి ఈ–ఫైలింగ్‌ గడువులోగా చేయకపోతే రూ.వెయ్యి లేట్‌ ఫైలింగ్‌ పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.
ఆదాయ రూ.5 లక్షలు దాటి డిసెంబర్‌ 31 వరకూ ఈ–ఫైలింగ్‌ చేయకపోతే రూ.5 వేలు, డిసెంబర్‌ 31 తర్వాత రూ.10 వేలు లేట్‌ ఫైలింగ్‌ పెనాల్టీ చెల్లించాలి. లేట్‌ ఫైలింగ్‌ పెనాల్టీ చెల్లించకుండా 2018–19 పర్సనల్‌  ఈ–ఫైలింగ్‌ చేయడం కుదరదని గమనించండి.
2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో ఈ–ఫైలింగ్‌ చేసుకోని ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 31లోగా ఎలాంటి పెనాల్టీ లేకుండా ఫైలింగ్‌ చేసుకునే సౌకర్యం ఉంది. వెంటనే ఈ సౌకర్యం వినియోగించుకోవడం మంచిది.

ఈ–ఫైలింగ్‌కి కావాల్సినవి
సంబంధిత సంవత్సరం ఫారం–16, పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, శాలరీ అకౌంట్‌ నంబర్, ఆ బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఈ–మెయిల్‌ ఐడీ, సెల్‌ నంబర్‌ (ఈ రెండు ఓటీపీ కోసం తప్పనిసరి).

ఈ–ఫైలింగ్‌తో ఉపయోగాలు
తమ వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యే ప్రతి మొత్తానికి ట్యాక్స్‌ చెల్లించనవసరం ఉండదు.
ఉద్యోగులు నెలవారి చెల్లించే అడ్వాన్స్‌ ఆదాయ పన్ను వల్ల క్వార్టర్‌లో చెల్లించాల్సిన ట్యాక్స్‌ కంటే ఎక్కువ/తక్కువ చెల్లించినవారికి ఐటీ శాఖ నుంచి ఎటువంటి నోటీసులు రావు.
ట్యాక్స్‌ ఎక్కువ చెల్లించినవారికి నేరుగా తమ ఖాతాలోకి తిరిగి జమ అవుతుంది.
డీడీవోలు తమ ఉద్యోగులు నెలవారీగా చెల్లిం చిన అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను ప్రతి క్వార్టర్‌లో టీడీఎస్‌ అప్‌డేట్‌ చేయించుకుంటూ ఉండాలి. అలా చేయని డీడీవోలకు రోజుకు రూ.200 ఆపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుంది.

పేరు రిజిస్టర్‌ చేసుకొనుట
⇔ http://incometaxindiaefiling.gov.in/home అనే వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి రిజిస్టర్‌ యువర్‌ సెల్ఫ్‌ అను ఆప్షన్‌ను ఎంచుకొనాలి. దానిలో పాస్‌వర్డ్‌ తదితర వివరాలను పూర్తిచేసిన తదుపరి మొబైల్‌కి వచ్చిన పిన్‌ నంబర్‌ను నమోదు చేస్తే రిజిస్ట్రేన్‌ పూర్తయినట్టే. మీ పాస్‌వర్డ్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
తర్వాత ఫారం 26ఏఎస్‌ ఓపెన్‌ చేసుకుని ఆ సంవత్సరం మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదైనదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు. ఈ ఫారంలో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఈ–రిటర్న్‌ చేయాలి.
ఈ–ఫైలింగ్‌ పూర్తయ్యాక ఐటీఆర్‌–1 సబ్మిట్‌ చేసిన తర్వాత ఎక్నాలెడ్జ్‌మెంట్‌ ఆప్షన్‌ వస్తాయి. ఎక్నాలెడ్జ్‌మెంట్‌ కాపీని బెంగుళూరుకు పంపాల్సింది లేనిదీ ఎక్నాలెడ్జ్‌మెంట్‌ కింది భాగంలో పేర్కొంటుంది. పంపాల్సి వస్తే సంతకం చేసి 3 నెలలలో పంపించాలి. 

మరిన్ని వార్తలు