ఇంధన దిగ్గజం కోల్‌ ఇండియాకు లాభాల పంట

11 Nov, 2023 13:57 IST|Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్‌ ఇండియా పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 6,800 కోట్లను తాకింది. అధిక అమ్మకాలు ఇందుకు సహకరించాయి. 

గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 6,044 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 15.25 చొప్పున తొలి మధ్యంతర డివిడెండును బోర్డు ప్రకటించింది. కాగా.. మొత్తం అమ్మకాలు సైతం రూ. 27,539 కోట్ల నుంచి రూ. 29,978 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 26,000 కోట్లను దాటాయి. ఈ కాలంలో ఇంధన కొనుగోలు ఒప్పందం(ఎఫ్‌ఎస్‌ఏ)లో భాగంగా ఒక్కో టన్ను బొగ్గుకు సగటున దాదాపు రూ. 1,542 చొప్పున లభించినట్లు కంపెనీ వెల్లడించింది. 

దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ తాజా సమీక్షా కాలంలో 157.42 మిలియన్‌ టన్నులను ఉత్పత్తి చేసింది. గతేడాది క్యూ2లో 139.23 ఎంటీ బొగ్గు మాత్రమే ఉత్పత్తయ్యింది. ఇక అమ్మకాలు సైతం 154.53 ఎంటీ నుంచి 173.73 ఎంటీకి జంప్‌ చేశాయి. ఈ ఏడాది 780 ఎంటీ విక్రయాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు