దేవుని భూములనూ వదల్లేదు

1 Jul, 2019 10:17 IST|Sakshi

కావేటిపాళెంలో నిషేధిత భూములకు అడంగల్, 1బీలో పేర్లు నమోదు చేసిన రెవెన్యూ అధికారులు

రూ.60 లక్షలకు పైగా వసూలు

టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారుల నిర్వాకం

సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు): బుచ్చిరెడ్డిపాళెం మండలం కావేటిపాళెంలో సుమారు 530 ఎకరాల దేవదాయ ధర్మాదాయ శాఖ భూములున్నాయి. వీటిని సెక్షన్‌ 22ఏ కింద నిషేధిత భూములుగా ఆ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రకటించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ గెజిట్‌ పబ్లికేషన్‌లో నిషేధిత భూములుగా ఇచ్చి ఉన్నారు. వీటిని మళ్లీ రివైజ్డ్‌ చేసి కూడా 2018 జూన్‌ 2వ తేదీన నిషేధిత జాబితాలో చూపించారు. బుచ్చిరెడ్డిపాళెంలోని కోదండరామస్వామి దేవస్థానానికి ఇనాంగా వచ్చినట్లు, ఆలయానికి చెందినదిగా ట్రిబ్యునల్‌లో కేసు సైతం వేశారు.

నిషేధిత భూములకు అడంగల్, 1బీ
నిషేధిత భూములకు గతంలో తహసీల్దార్‌గా ఉన్న రామలింగేశ్వరరావు, ఆర్‌ఐ, వీఆర్వో కృష్ణప్రసాద్‌ టీడీపీ నేతలతో కుమ్మక్కై ప్రస్తుతం భూములను సాగుచేస్తున్న వారి పేర్లను అడంగల్, 1బీలో నమోదు చేశారు. కేసులతో పాటు నిషేధిత జాబితాలో ఉందని తెలిసినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి మరీ భూములకు సంబంధించి అడంగల్, 1బీలో పేర్లు నమోదు చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధం లేని ఈ భూములను దేవదాయ ధర్మాదాయ శాఖ అనుమతి లేకుండాను తమ ఇష్టానుసారంగా మ్యుటేషన్‌ చేసి హక్కులు కల్పించారు. కేవలం అగ్రిమెంట్స్‌పై అడంగల్‌తో పాటు 145 ఖాతాల నంబర్లను క్రియేట్‌ చేసిన ఘనత ఈ అధికారులదే. ఏకంగా 300 ఎకరాల నిషేధిత భూములను పట్టాలుగా మార్చేశారు.

రూ.60 లక్షలకు పైగా స్వాహా
నిషేధిత భూములను సాగుచేసుకుంటున్న వారి నుంచి పంచేడుకు చెందిన టీడీపీ నేతలు 60 లక్షలకు పైగా వసూలు చేశారని ఆరోపణలున్నాయి. వీటిలో తహసీల్దార్‌ రామలింగేశ్వరరావుతో పాటు ఆర్‌ఐ, వీఆర్వోకు ముట్టజెప్పినట్లు సమాచారం. మిగతా ఆయా నేతలు స్వాహా చేశారని అంటున్నారు.

గత కలెక్టర్‌ ముత్యాలరాజు సీరియస్‌
కావేటిపాళెంలో రెవెన్యూ అధికారులు దందా విషయంపై గత కలెక్టర్‌ ముత్యాలరాజుకు పలువురు రైతులు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్‌ రామలింగేశ్వరరావు చేసిన దందాపై వివరాలు తెలిపారు. దీంతో ముత్యాలరాజు సీరియస్‌ అయ్యారు. దీంతో పాటు పలు నిషేధిత భూములకు పట్టాలు మంజూరుచేయాలన్న తహసీల్దార్‌ ప్రతిపాదనలపై మండిపడినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఎన్నికల ముందు ఇప్పుడు విధుల్లో ఉన్న తహసీల్దార్ల సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

ఆరోపణలున్నా.. మళ్లీ బుచ్చిరెడ్డిపాళేనికి
కావేటిపాళెంలో జరిగిన దందా జిల్లా మొత్తం హాట్‌టాపిక్‌గా మారిన రామలింగేశ్వరరావును మిగిలిన వారి పేర్ల నమోదుకు సంబంధించి పలువురు టీడీపీ నేతలు మళ్లీ బుచ్చిరెడ్డిపాళేనికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో పలు భూములకు సంబంధించి నాయకుల పేర్లు నమోదు చేసేందుకు సమయం లేకుండా పోయింది. అందుకోసం ఇతరులను పురమాయించామని, దాదాపు ఖరారయిందని టీడీపీ నేతలు చెప్పడం విశేషం. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్న నేపథ్యంలో ఇటువంటి అవినీతి అధికారులపై ప్రస్తుత కలెక్టర్‌ శేషగిరి బాబు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి 
పేదలకు ఇచ్చేందుకు సెంటు భూమి లేదని చెబుతున్న రెవెన్యూ అధికారులు నిషేధిత భూములకు లంచాలు తీసుకుని పలువురి పేర్లను రికార్డులో నమోదు చేయడం దారుణం. ఓ వైపు రిజిస్ట్రేషన్‌ శాఖ గెజిట్‌ పబ్లికేషన్‌ విడుదల చేసి ఉన్నప్పటికీ, సంబంధం లేని రెవెన్యూ అధికారులు ఆయా భూముల్లో పలువురి పేర్లను పట్టాదారులుగా అడంగల్, 1బీలో నమోదు చేయడం దారుణం. దీనికి కారకులైన అప్పటి తహసీల్దార్‌ రామలింగేశ్వరరావు, ఆర్‌ఐ, వీఆర్వోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 
– పచ్చా మధుసూదన్‌రావు, దళిత హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కావేటిపాళెం భూముల విషయం నా దృష్టికి రాలేదు 
కావేటిపాళెంలోని నిషేధిత భూములకు పట్టాదారులుగా పలువురి పేర్లు చేర్చిన విషయం నా దృష్టికి రాలేదు. నిషేధిత భూములకు అడంగల్, 1బీ ఇచ్చే హక్కు లేదు. దీనిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటాం.
– చిన్నికృష్ణ, ఆర్డీఓ, నెల్లూరు

మరిన్ని వార్తలు