రెవెన్యూ, పోలీసులు సమన్వయంతో పని చేయాలి

4 Sep, 2015 03:38 IST|Sakshi
రెవెన్యూ, పోలీసులు సమన్వయంతో పని చేయాలి

కడప కల్చరల్ : రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ కేవీ రమణ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సభా భవనంలో ఇసుక మైనింగ్, అమ్మకాలపై ఆయా శాఖల అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఇసుక అమ్మకాలు పరిశీలించినపుడు కొన్ని మండలాల్లో అతి తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని తెలిపారు. ఎర్రగుంట్ల, మైదుకూరు మండలాల్లో అమ్మకాలు జరగనట్లుందన్నారు. కోడూరు మండలంలో అధికంగా అమ్మకం జరగ్గా, ఆ తర్వాత స్థానంలో ప్రొద్దుటూరు నిలిచిందన్నారు.

ఇసుక అక్రమ రవాణా, అక్రమ అమ్మకాలు జరగకుండా పోలీసు, రెవెన్యూశాఖలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో, ముఖ్యంగా రాత్రి సమయాల్లో పోలీసు గస్తీని పెంచుతామన్నారు. డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 17 రీచ్‌ల నుంచి ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని వివరించారు. ఈనెల 10 నుంచి ఇసుక వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అన్ని రీచ్‌లలో సీసీ కెమెరాలు పెట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొబైల్ టీములను క్రియాశీలకం చేస్తామన్నారు.

అనుమతికి మించి ఇసుకను తీసుకెళ్లే వాహనాలను మోటారు ఇన్‌స్పెక్టర్లు పరిశీలించాలని, తహశీల్దార్లు, ఇన్‌స్పెక్టర్లు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎద్దుల బండ్ల ద్వారా ఇసుక రవాణా జరగకుండా చూడాలని, క్యూబిక్ మీటరు ఇసుక రూ. 650లు ఉండేదని, రూ. 50కు తగ్గించామని, మరో రూ. 50 తగ్గిం చేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ తెలి పారు. ఈ కార్యక్రమంలో జేసీ రామారావు, కడప, రాజంపేట, జమ్మలమడుగు ఆర్డీఓలు చిన్నరాముడు, ప్రభాకర్‌పిళ్లై, వినాయకం, డీటీసీ బసిరెడ్డి, డీఎస్పీలు, తహశీల్దార్లు, సీఐలు, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
 
ఓటర్ల నమోదులో పెండింగ్ అర్జీలు పరిష్కరించాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణల్లో భాగంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈనెల 10వ తేదీలోపు పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంయుక్త అధికారి అనూప్‌సింగ్ కలెక్టర్‌లను ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్‌స నిర్వహించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం-2016కు సంబంధించి ఫారం-6, 7, 8, 8ఏ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి నివేదికను పంపాలన్నారు. ఓటర్ల సంఖ్య అధికంగా ఉంటే జనాభా ప్రాతిపదిక ప్రకారం పోలింగ్ స్టేషన్లు అదనంగా ఏర్పాటు చేయాలని, ఇందుకు అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఓటర్ల నమోదు ఇంటి నెంబర్ల ప్రకారం పొరపాట్లు లేకుండా చూడాలన్నారు.

ఓటర్ల నమోదు సమయంలో ఆధార్ సీడింగ్ తప్పనిసరిగా చేపట్టాలన్నారు. ఓటర్లు ఇల్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లి ఉన్నా, చనిపోయి ఉన్నా వారి పేర్లు జాబితాలో నుంచి తొలగించాలని చెప్పారు. ప్రత్యేక ఓటరు జాబితా వివరాలు ప్రతినెలా రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపాలన్నారు. జిల్లాలో 53 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఈనెల 10వ తేదీలోపు పరిష్కరించి నివేదిక పంపాలని కలెక్టర్ కేవీ రమణకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కేవీ రమణ, జేసీ రామారావు, డీఆర్వో సులోచన, జెడ్పీ సీఈఓ రజియాబేగం, ఆర్డీఓలు చిన్నరాముడు, ప్రభాకర్‌పిళ్లై, వినాయకం, డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం, కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణ, పలువురు తహశీల్దార్లు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు