అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష

15 Dec, 2023 20:20 IST|Sakshi

లక్నో:  మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు బీజేపీకి  చెందిన ఓ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్షను శుక్రవారం ఎంపీ-ఎమ్మెల్యే న్యాయస్థానం విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని దుద్ది అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గిరిజన ఎమ్మెల్యే రామదులారే గోండ్.. 4, నవంబర్‌, 2014న ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అతనిపై మయోర్పూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఘటన జరిగిన సుమారు ఏడాదిపాటు  బాధితురాలి సోదరుడిని కేసు వెనక్కి తీసుకోవాలని రామదులారే బెదిరించాడు.

ఆ ప్రాంతంలో బలమైన నాయకుడిగా పేరున్న రామదులారేకు బీజేపీ.. దుద్ది అసెంబ్లీ నియోజకవర్గం  టిక్కెట్‌ ఇవ్వటంతో గెలుపొందారు. అత్యాచార కేసులో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు పోక్సో చట్టం కింద మంగళవారం అతన్ని దోషిగా తేల్చింది.  సోనభద్ర ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి  అహ్సన్ ఉల్లా ఖాన్ ఎమ్మెల్యే రామదులారేకు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించారు. రూ.10 లక్షల జరిమానా అత్యాచార బాధితురాలకు అందించాలని కోర్టు ఆదేశించింది. 9 ఏళ్ల పాటు పోరాడిన అత్యాచార బాధితురాలి కుటుంబం ఈ తీర్పుపై ఆనందం వ్యక్తం చేసింది. దీంతో రామదులారేపై బీజేపీ పార్టీ అనర్హత వేటు వేసింది. అధికార బీజేపీ పార్టీ.. రామదులారే చేసిన నిర్వాకం వల్ల ప్రతిపక్షాల విమర్శకు గురికాక తప్పదని పార్టీ వర్గాలు చర్చింకుంటున్నాయి.

చదవండి: ‘పార్లమెంట్‌ భద్రత.. ప్రభుత్వ బాధ్యత కాదు’

>
మరిన్ని వార్తలు