సాగునీటి ప్రాజెక్టులపై నేటినుంచి సమీక్ష

6 Sep, 2013 07:06 IST|Sakshi
సాగునీటి ప్రాజెక్టులపై నేటినుంచి సమీక్ష

సాక్షి, హైదరాబాద్: జలయజ్ఞంలో భాగంగా మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు, ఐదేళ్ల క్రితం మంజూరు చేసి, ఇప్పటికీ పనులు మొదలుపెట్టని ప్రాజెక్టుల పరిస్థితిని అంచనా వేసి వాటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. పనులు నిలిచిపోయిన ప్రాజెక్టులతో పాటు నిర్మాణాలు చివరిదశలో ఉన్న ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడానికి వీలుగా ప్రభుత్వం ఈ నెల 6, 7వ తేదీల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది.
 
 రాష్ర్ట సాగునీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి సమక్షంలో జరిగే ఈ సమావేశానికి శాఖ ముఖ్యకార్యదర్శులు, ఈఎన్‌సీలు, సీఈలు హాజరుకానున్నారు. సుమారు ఐదేళ్ల క్రితం దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఖరారు చేశారు. దీని నిర్మాణ పనులు ఇంకా మొదలుకాలేదు. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం కూడా పక్కకు పడిపోయింది. ఐదేళ్ల క్రితమే దీని నిర్మాణానికి అనుమతి ఇచ్చినా ఇప్పటికీ టెండర్లను కూడా ఖరారు చేయలేదు. ఇక కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఎల్లంపల్లి, దేవాదుల, పులిచింతల వంటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి చొరవ లేకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలను నిలిపివేశారు. ప్రాజెక్టులు పూర్తికాక ఈ ఏడాది గోదావరి నుంచి సుమారు 3,500 టీఎంసీల నీరు సముద్రంపాలయింది. అలాగే కృష్టా నీటిని కూడా సముద్రంలోకి వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వీటి పరిస్థితిని శుక్రవారం నుంచి జరిగే సమావేశాల్లో సమీక్షించనున్నారు.

మరిన్ని వార్తలు