రిమ్స్‌కు వైరాలజీ రీసెర్చ్ ల్యాబ్

13 Jan, 2015 02:18 IST|Sakshi
రిమ్స్‌కు వైరాలజీ రీసెర్చ్ ల్యాబ్

రిమ్స్ (కడప అర్బన్): కడప రిమ్స్‌కు త్వరలో వైరాలజీ రీసెర్చి ల్యాబ్ అందుబాటులోకి రానుంది. డెంగీ, మలేరియా లాంటి భయంకరమైన, దీర్ఘకాలిక వ్యాధులు ఏ వ్యాధి కారక క్రిముల నుంచి వస్తాయో, ఏ విధంగా వ్యాపిస్తాయో సమగ్ర పరిశోధన జరగనుంది. ఇలా పరిశోధనలు సమగ్రంగా జరిగితే సదరు వ్యాధి కారక క్రిములను రానీయకుండా, వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన  జాగ్రత్తలపై కూడా వైద్య బృందం అప్రమత్తం అవుతుంది.

రాష్ట్రంలోని రిమ్స్‌లలో కడప రిమ్స్‌కు మైక్రో బయాలజీలోని వైరాలజీ విభాగంలో నూతన అధ్యాయం మొదలు కానుంది. ఇందుకోసం వైరాలజీ విభాగం పరిశీలనకు ఢిల్లీ నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తరుపున ప్రత్యేక వైద్య బృందం సోమవారం కడప రిమ్స్‌కు వచ్చింది. రిమ్స్ డెరైక్టర్ డాక్టర్‌సిద్దప్ప గౌరవ్‌ను కలిసిన బృందం వైరాలజీ డిపార్టుమెంటును పరిశీలించారు.

మైక్రో బయాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ శశిధర్, వైద్య సిబ్బంది ఈ బృందానికి సహకరించారు. తరగతి గదులు, ఎగ్జిబిషన్ హాలు, ప్రస్తుతం నిర్వహిస్తున్న ల్యాబ్, పరికరాలు అన్నింటినీ పరిశీలించారు. ఈ బృందంలో వేలూరులోని నారాయణి వైద్య కళాశాల తరుపున వచ్చిన డాక్టర్లు శ్రీధర్, సతీష్, మహేష్ ఉన్నారు. అన్ని సంతృప్తిగా ఉన్నాయని, ఆ మేరకు నివేదిక పంపనున్నట్లు సమాచారం.
 
త్వరలో రూ.6.2 కోట్లు మంజూరు
 కడప రిమ్స్‌లో మైక్రో బయాలజీ డిపార్టుమెంటు పరిధిలోని వైరాలజీ విభాగం రీసెర్చి ల్యాబ్‌కు ప్రభుత్వం రూ.6.2 కోట్లు మంజూరు చేయనుంది. ప్రాథమిక దశగా ఐసీఎంఆర్ బృందం విచ్చేసి పరిశీలించారు. ఈ సందర్బంగా రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్‌మాట్లాడుతూ మైక్రో బయాలజీలోని వైరాలజీ రీసెర్చి ల్యాబ్ త్వరలో కడప రిమ్స్‌కు అందుబాటులోకి రానుందన్నారు.  బృందం నివేదిక మేరకు త్వరలోనే నిధులు వస్తాయన్నారు. కార్యక్రమంలో రిమ్స్ వైద్య బృందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు