బస్సులన్నీ సీఎం సభకు

12 Jan, 2019 08:14 IST|Sakshi

నెల్లూరుకు తరలివెళ్లిన 310 బస్సులు

సాధారణ సర్వీసులూ జన్మభూమి సభకే

రద్దీరూట్లలో బస్సులు నిల్‌

స్పెషల్‌ బస్సుల పేరుతో దోపిడీ

అవస్థలు పడ్డ విద్యార్థులు, ప్రయాణికులు

పండగ రోజుల్లో పడరాని పాట్లు

ఆర్టీసీ బస్సులన్నీ సీఎం సభకే తరలించారు. శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వాలదిన్నె గ్రామంలో జరిగిన జన్మభూమి–మాఊరు ముగింపు సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున బస్సులు తరలివెళ్లాయి. 14 డిపోల నుంచి సుమారు 310 బస్సులను తరలించారు. బస్‌స్టేషన్లన్నీ వెలవెలబోయాయి. సంక్రాంతి సెలవుల కోసం ఇళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు పడరానిపాట్లు పడాల్సి వచ్చింది. ఇదిలావుండగా ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్‌ సర్వీసుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది.

చిత్తూరు , తిరుపతి సిటీ: జిల్లా ఆర్టీసీ అధికారులు స్వామి భక్తిని చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన సీఎం సభకు పెద్ద ఎత్తున బస్సులు తరలించారు. సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు, యువత, కుటుంబ సభ్యులు స్వగ్రామాలకు వెళ్లలేక నానా తిప్పలు పడాల్సి వచ్చింది.

గంటల తరబడి నిరీక్షణ
తిరుపతి, మదనపల్లి, పీలేరు, చిత్తూరు, శ్రీకాళహస్తి బస్‌ స్టేషన్లు బస్సులు లేక బోసిపోయాయి. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మాములు రోజుల్లో తిరిగే సర్వీసులు కూడా అర్ధాంతరంగా నెల్లూరు జిల్లాలో జరిగిన సీఎం సభకు తరలించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే బస్సులు తరలించడం ఏమిటని ప్రయాణికులు మండిపడ్డారు. చివరకు ప్రయివేటు వాహనాలను ఆశ్రయించి స్వగ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది.

స్పెషల్‌ సర్వీసు పేరుతో దోపిడీ
ఉన్న సర్వీసులను రద్దు చేసి స్పెషల్‌ సర్వీసుల పేరుతో సాధారణ చార్జీకి అదనంగా మరో 50 శాతం వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది. తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులు అదనపు చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తగా 14 డిపోల్లో 1,516 బస్సులు ఉండగా అందులో 310 బస్సులు నెల్లూరు జిల్లాలో జరిగిన సీఎం సభకు తరలివెళ్లాయి.

స్వామి భక్తి
సురక్షితం.. ఆర్టీసీ ప్రయాణం అంటూ సంబంధిత అధికారులు ఊదరగొట్టడం పరిపాటే. కానీ క్షేత్రస్థాయిలో ప్రయాణికుల సేవలను గాలికొదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదలే పండుగ సీజన్‌.. దానికితోడు ఉన్న అరకొర బస్సులను కూడా రాజకీయ సభలకు తరలించడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టని పరిస్థితి. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని తెలిసినా అధికారపార్టీపై ఉన్న వ్యామోహంతో కొందరు అధికారులు బస్సులు తరలించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రద్దీ రూట్లలో బస్సులు రద్దు
సాధారణంగా రోజువారీ ఎక్కువగా తిరిగే సర్వీసుల్లో చాలావరకు బస్సులను రద్దు చేసి సీఎం సభకు మళ్లించినట్లు ఆర్టీసీ అధికారులే చెబుతున్నారు. ఘాట్‌రోడ్డు సర్వీలు, చిత్తూరు, కాణిపాకం, శ్రీకాళహస్తి, పుత్తూరు, సత్యవేడు ప్రాంతాల మధ్య తిగిరే సర్వీసులను రద్దు చేశారు. బస్‌ స్టేషన్లలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ‘స్పెషల్‌ సర్వీస్‌’ పేరిట ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

ఆకలి కేకలు
 నెల్లూరు జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సీఎం సభకు రెండురోజుల ముందే ఆర్టీసీ బస్సులను పలు మండలాలకు వెళ్లాలని డిపో మేనేజర్లు ఆయా డిపోల్లోని డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. వారికి కేటాయించిన గ్రామాలకు బస్సులు తీసుకెళ్లినా అక్కడ సరైన భోజనం, వసతి లేక సిబ్బంది నానాతిప్పలు పడాల్సి వచ్చింది. సీఎం సభ ముగిసిన తర్వాత తిరిగి వారి స్వగ్రామాల్లో వదిలి డిపోకు చేరేవరకు ఖాళీ కడుపుతోనే విధులు నిర్వహించాల్సి వచ్చిందని కొందరు సిబ్బంది చెప్పడం గమనార్హం.

సారూ.. మారాలి మీరు
 పండుగల సీజన్, సెలవుల సమయాల్లో, ప్రయాణికుల రద్దీ సమాయాల్లో కావాల్సినన్ని బస్సులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యందే. అధికారులు మాత్రం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ వారు చెప్పినచోటికి బస్సులను తిప్పడం విమర్శలకు తావిస్తోంది. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తోంది. అధికారుల తీరులో మార్పు రావాలని.. ముందు ప్రయాణికులకు కావాల్సినన్ని బస్సులు ఏర్పాటు చేసి స్పేర్‌గా ఉన్న బస్సులను మాత్రమే ఇతర వాటికి వినియోగించాలని పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు