ఆర్టీసీ కార్మికుల ర్యాలీ

10 Dec, 2014 02:17 IST|Sakshi

ఆర్టీసీ కార్మిక చైతన్య సదస్సులో భాగంగా ఒంగోలులో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.  అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ  ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావాలంటే ఎంప్లాయీస్ యూనియన్‌తో మాత్రమే సాధ్యమని, అందుకు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో యూనియన్ పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవడానికి ప్రతి కార్మికుడు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.                    
 
ఒంగోలు : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావడం ఎంప్లాయీస్ యూనియన్‌తోనే సాధ్యమని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే పద్మాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో యూనియన్‌ను పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రతి కార్మికుడూ దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక పద్మావతి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన ఆర్టీసీ కార్మిక చైతన్య సదస్సులో పద్మాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఎంప్లాయీస్ యూనియన్‌కు మాత్రమే ఉందన్నారు. రాష్ర్టం విడిపోయిన తర్వాత రూ.16 వేల కోట్ల లోటులో ఆంధ్రప్రదేశ్ ఉంటే.. పలకడు..ఉలకడు... అన్నట్లుగా చంద్రబాబునాయుడు పరిస్థితి ఉందన్నారు.

తెలంగాణలో రూ.16 వేల కోట్ల మిగులు ఉంటే కేసీఆర్ అన్నీ చేస్తానని ప్రకటనలు గుప్పిస్తున్నాడన్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎంలపై ఒత్తిడి తెచ్చి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కుల సాధనపై ఎంప్లాయీస్ యూనియన్ దృష్టిసారించిందన్నారు. ఆర్టీసీ ప్రకాశం రీజియన్ మేనేజర్ వి.నాగశివుడు మాట్లాడుతూ ఆర్టీసీ ఎక్కువగా మానవశక్తితో నడుస్తుందని, అందువల్ల వారధిలా పనిచేసే యూనియన్లతో తాము సత్సంబంధాలు కలిగి ఉంటామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు బలంగా ఉంటే ఆర్టీసీ యాజమాన్యం తీసుకునే నిర్ణయాలు కూడా త్వరితగతిన కార్మికులకు చేరతాయన్నారు.

అందులో భాగంగానే కొన్ని కీలకమైన నిర్ణయాలపై యూనియన్లతో కూడా చర్చిస్తుంటామని తెలిపారు. ఈయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీకి ఏపీలో రోజుకు రూ.3 కోట్ల నష్టం వస్తుందన్నారు. దాని ప్రకారం ఏడాదికి రూ.వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. అందువల్ల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఒక్కటే శరణ్యమన్నారు. రాబోయే గుర్తింపు యూనియన్ ఎన్నికల నాటికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మికుల ముందుకు వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. ముందుగా స్థానిక ఒంగోలు ఆర్టీసీ బస్టాండు వద్ద నుంచి కర్నూలు రోడ్డు, అద్దంకి బస్టాండు, నవభారత్ థియేటర్ మీదుగా పద్మావతి ఫంక్షన్ హాలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీఆర్ చౌదరి, కార్యదర్శి ఎస్.కోటేశ్వరరావు, సీపీఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు, ఆర్టీసీ రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు కే నాగేశ్వరరావు, వాకా రమేష్‌బాబు, ప్రచార కార్యదర్శి ముఖర్జీ, ఆర్టీసీ మాజీ అధ్యక్షుడు కొత్తకోట వెంకటేశ్వర్లు, రీజినల్ గౌరవాధ్యక్షుడు ఏ రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీఆర్ బాబు, ఆర్‌వీ రాయుడు, నూకతోటి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు