...పార్వతి చనిపోయింది

31 Mar, 2015 08:14 IST|Sakshi
పార్వతి(ఫైల్ ఫోటో), బిక్కు బిక్కుమంటూ ఆస్పత్రి ముందు కూర్చున్న పిల్లలు సతీష్, లక్ష్మి

పార్వతీపురం: భర్త నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయి విజయనగరం జిల్లా పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాలీల పార్వతి(25) ఆదివారం రాత్రి మృతి చెందింది. భర్తవేధింపులు తట్టుకోలేక, పడుపువృత్తి చేసి డబ్బులు సంపాదించమనడాన్ని సహించలేక అతన్ని బెదిరించేందుకు ఆదివారం ఒంటిపై కిరోసిన్ పోసుకున్న పార్వతికి భర్త శివ నిప్పంటించిన విషయం తెలిసిందే.

పట్టణ ఎస్‌ఐ వి.అశోక్ కుమార్ కథనం ప్రకారం... నాలుగేళ్లుగా సాలీల శివ తన భార్య పార్వతిని అనుమానంతో వేధిస్తున్నాడు. నిత్యం ఆమెను కొడుతుండడంతో బాధలు భరించలేక తన పుట్టింటివారు ఉన్న జియ్యమ్మవలస మండలం గెడ్డతిరువాడకు గతంలో వెళ్లిపోయింది.  తరువాత పెద్దలు సయోధ్య కుదిర్చి ఒక్కటి చేశారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా తరువాత మళ్లీ వేధించడం ప్రారంభించాడు. ఆదివారం ప్లాన్ ప్రకారం పిల్లలను బయటకు పంపించి భార్యను వేధించడం ఆరంభించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

భర్తను బెదిరించేందుకు పార్వతి ఒంటిపై కిరోసిన్ పోసుకోగా, శివ నిప్పంటించాడు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. అయితే పార్వతి గట్టిగా అరవకుండా ఆమె ఆడపడుచు వికలాంగురాలైన సోమేశ్వరి ఆమె నోటిలో గుడ్డలు కుక్కి ఆమె చావుకు కారణమైందని ఎస్‌ఐ చెప్పారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలు పాలు కానుండడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి పరిస్థితిని చూసిన స్థానికులు కంటతడిపెట్టారు.

మరిన్ని వార్తలు