48వ రోజు సోమవారం జిల్లాలో ఉద్యమాలు హోరెత్తాయి

17 Sep, 2013 03:57 IST|Sakshi
సమైక్య నినాదం పల్లెపల్లెలో ప్రతిధ్వనిస్తోంది. జిల్లాలో రోజు రోజుకూ ఉద్యమం ఉధృతమవుతోంది. సమైక్యవాదులు విభిన్న రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ర్ట విభజన విషయంలో అనాలోచిత నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తెలుగుజాతిని విడదీసే కుట్రల్ని సాగనివ్వబోమంటూ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, పార్టీలకతీతంగా నాయకులు చేయీచేయీ కలిపి కదం తొక్కుతున్నారు. సమైక్యమే శ్వాసగా ముందడుగేస్తున్నారు.
 
 గుంటూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రాని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ 48వ రోజు సోమవారం జిల్లాలో ఉద్యమాలు హోరెత్తాయి. ఉపాధ్యాయుల జేఏసీ, ఎన్జీవోల జేఏసీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహించిన లక్షజన సమైక్య రణభేరి విజయవంతమైంది.  టీడీపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు నగరంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరాలు, సత్తెనపల్లిలో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించగా ఆర్టీసీ, ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడ్డారు. 
 
 మంగళగిరిలో మహిళా శంఖారావం
 బాపట్ల పట్టణంలో పండ్ల వ్యాపారులు ర్యాలీ చేశారు. పాతబస్టాండు సమీపంలో భాష్యం, రవీంద్రభారతి విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం రోడ్డుపై కోలాటం ఆడి నిరసన తెలిపారు. కర్లపాలెం మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో పశువులను రోడ్డుమీదకు తోలి రాస్తారోకో నిర్వహించారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద నిర్వహించిన మహిళా శంఖారావానికి వేలాదిగా మహిళలు తరలి వచ్చారు. పట్టణంలో విద్యార్థులు యోగాసనాలు వేశారు. దుగ్గిరాలలో ఉపాధ్యాయ జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శనలు చేపట్టారు. నరసరావుపేటలో రజక వృత్తిదారులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయ, ఎన్జీవో, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పొన్నూరు, వినుకొండ పట్టణాల్లో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. చేబ్రోలు మండలం వడ్లమూడిలో గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. 
 
 తెనాలిలో ఆర్డీవో శ్రీనివాసమూర్తి ఆర్డీ కార్యాలయంలో సమైక్యాంధ్ర ఆడియో క్యాసెట్‌ను విడుదల చేశారు. మాచర్లలో ఉపాధ్యాయుల జేఏసీ నాయకులు తల్లకిందులుగా నిలబడి నిరసన తెలిపారు. గురజాల నియోజకవర్గంలో అర్చకులు రోడ్డుపై హోమం నిర్వహించారు. ఈ హోమాన్ని స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు  ప్రారంభించారు. పెదకూరపాడులో నివసిస్తున్న తెలంగాణ వాసిని సన్మానించారు. సంచార జాతులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. రేపల్లె నియోజకవర్గంలో జ్యుడిషియల్ ఉద్యోగులు రోడ్డుపై వంటవార్పు నిర్వహించారు.
 
 గుంటూరు నగరంలో.. గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులో గృహనిర్మాణశాఖ జిల్లా కార్యాలయం ఎదురు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలు సోమవారంతో 14వ రోజుకు చేరాయి. దీక్షల్లో జిల్లాలోని డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యవసాయ అనుబంధశాఖల ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారికి రక్తాన్ని అందచేశారు. దీక్ష శిబిరాన్ని గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల వ్యవసాయ అధికారులు వైస్ ప్రెసిడెంట్ బి.కబ్బిరెడ్డి ప్రారంభించారు. సుమారు 56 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. కార్పొరేషన్ ఉద్యోగులు చీపుర్లుకు సోనియాగాంధీ, కేసీఆర్ బొమ్మలు కట్టి రోడ్లు ఊడ్చారు. విద్యార్థి జేఏసీ నాయకులు శంకర్‌విలాస్ సెంటర్‌లో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు హిందూకళాశాల సెంటర్‌లో మంగళవారం నిర్వహించనున్న ‘మండే గుండెల ఘోష’ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
>
మరిన్ని వార్తలు