ఒకే వాహనం.. ఒకే కోడ్‌ AP 39

1 Nov, 2018 13:45 IST|Sakshi

రవాణా శాఖలో నూతన విధానం

రాష్ట్రమంతటా ఒకటే రిజిస్ట్రేషన్‌ కోడ్‌

కృష్ణా జిల్లాకు పెరగనున్న ఆదాయం

ఇక ఫ్యాన్సీ నంబర్ల కోసం  పక్క జిల్లాలకు వెళ్లాల్సిన పనిలేదు

రవాణా శాఖలో ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని తీసుకొస్తున్న ఆ శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం మరోసారి తనదైన ముద్ర వేశారు. ఇప్పటికే రవాణా శాఖలో ప్రతిదీ ఆన్‌లైన్‌ చేసిన ఆయన తాజాగా రాష్ట్రమంతటా ఒకే రిజిస్ట్రేషన్‌ కోడ్‌కు శ్రీకారం చుట్టారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాల వారీగా కొనసాగిన రిజిస్ట్రేషన్‌ కోడ్‌లు రద్దు కానున్నాయి. ఇకపై కొత్త వాహనాలకు జిల్లాకు ప్రత్యేక కోడ్‌ ఉండదు. ఏపీ–39 సిరీస్‌ పేరిట ఇక రాష్ట్రమంతటా ఒకే కోడ్‌ అమల్లోకి రానున్నట్లు తెలసుస్తోంది. 15 రోజుల్లో అమలుకానున్న ఈ నూతన విధానం వల్ల కృష్ణా జిల్లా ఆదాయం ‘9’ రెట్లు పెరగనున్నట్లు సమాచారం.

సాక్షి, అమరావతిబ్యూరో : రాబోయే రోజుల్లో ఏదైనా వాహనానికి 9999 లాంటి ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వాహన యజమాని ఇకపై అలాంటి నంబర్ల కోసం తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకు పక్క జిల్లాల్లో తాత్కాలిక చిరునామాతో ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటున్న వాహనదారుల ఆటలు ఇక సాగబోవు. ఏపీ రవాణా శాఖ తీసుకున్న కీలక నిర్ణయంతో ఇకపై రాష్ట్రమంతటా ఒకే సిరీస్‌ కోడ్‌ పేరిట వాహనాలకు నంబర్లను కేటాయించనున్నారు.

జిల్లాలో ‘ఏపీ–16’కు సెండాఫ్‌..
ఏపీ –16.. కృష్ణా జిల్లా రిజిస్ట్రేషన్‌ కోడ్‌ నంబరు. ఈ కోడ్‌ త్వరలో కనుమరుగవబోతోంది. రానున్న 15 రోజుల తర్వాత ఈ కోడ్‌ నంబరు ఏపీ–39గా మారనుంది. ఏపీ రవాణా శాఖ తీసుకున్న నిర్ణయంతో జిల్లా అంతటా ఒకే కోడ్‌ నంబర్‌ అమల్లోకి రానుంది. కొత్త సిరీస్‌ ప్రారంభం కావటం వల్ల రెండు రోజుల్లోనే 1–9999 నంబర్ల సిరీస్‌ మారిపోయే అవకాశం ఉంది. తద్వారా నెలలోనే 15సార్లు కొత్త సిరీస్‌ అంకెలు వచ్చేస్తుంటాయి.

జిల్లాకు ‘9’ రెట్ల ఆదాయం..
లగ్జరీ వాహనాలకు కృష్ణా జిల్లా పెట్టింది పేరు. దేశంలో ఏ కొత్త మోడల్‌ వాహనం వచ్చినా పదుల సంఖ్యలో ఆ వాహనాలను ఇక్కడ బడాబాబులు కొనుగోలు చేయడం పరిపాటి. బీఎండబ్ల్యూ, ఆడి, బెంజ్, రోల్స్‌ రాయిస్‌ వంటి ఖరీదైనా వాహనాలు కృష్ణా జిల్లా రహదారులపై సర్వసాధారణమయ్యాయి. రూ. కోట్ల విలువైన వాహనాలకు యజమానులు రూ. లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకుంటుంటారు. అయితే చాలా వాహనాలకు ఉత్తరాంధ్ర, రాయలసీమ రిజిస్ట్రేషన్‌ కోడ్‌తో ఫ్యాన్సీ నంబర్లు ఉంటున్నాయి. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్లకు పోటీ ఉండటంతో ఇప్పటిదాకా పక్క జిల్లాలకు వెళ్లి తమ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ నంబర్లు కేటాయించుకుంటున్నారు. రవాణా శాఖ రాష్ట్రమంతటా ఒకే రిజిస్ట్రేషన్‌ కోడ్‌ తీసుకురావడంతో ఇకపై కృష్ణా జిల్లావాసులు పక్క జిల్లాలకు వెళ్లాల్సిన పనిలేదు.  తాజా నిర్ణయంతో ఫ్యాన్సీ నంబర్లకు తీవ్ర పోటీ ఉంటుంది కాబట్టి ఈ ఆదాయం ‘9’ రెట్లకు పెరిగే అవకాశం ఉందని జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్‌ మీరా ప్రసాద్‌ ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు