కృష్ణానదిలో ఇసుక పడవ మునక

17 Oct, 2018 09:16 IST|Sakshi

ఉద్ధండరాయునిపాలెం ఇసుక రీచ్‌ సమీపంలో ఘటన

ఆ సమయంలో పడవలో నలుగురు కార్మికులు

వీరికి ఈత రావడంతో తప్పిన ప్రాణాపాయం

తాడేపల్లిరూరల్‌: ప్రకాశం బ్యారేజి కృష్ణానది ఎగువ ప్రాంతంలో నిత్యం వేల సంఖ్యలో ఇసుక పడవలు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నా, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దాని పర్యవసానమే మంగళవారం తెల్లవారు జామున కృష్ణానది ఎగువ ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెం ఇసుక రీచ్‌ సమీపంలో ఒక పడవ నీటమునిగింది. ఆ సమయంలో పడవ మీద నలుగురు కార్మికులు ఉన్నారు. ఈత రావడంతో ఈదుకుంటూ నది మధ్యలో నుంచి ఎలాగోలా బయటకు వచ్చారు. ఇంత జరుగుతున్నా కనీసం అధికారులకు కృష్ణానదిలో పడవ మునిగిందనే విషయమే తెలియకపోవడం గమనార్హం. 

నిబంధనలు ఇలా..
కృష్ణానదిలో పడవ తిరగాలంటే విజయవాడలోని ఇరిగేషన్‌ కార్యాలయంలో రిజర్వ్‌ కన్జర్వేటర్‌ అనుమతి తీసుకోవాలి. పడవ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌తో పాటు, ఇంజన్‌ పని విధానం, అది మోయగల బరువు సామర్థ్యాన్ని నిర్ధారిస్తూ సర్టిఫై చేయాలి. అంతేకాకుండా పడవ నడిపేవారు కాకినాడలో శిక్షణ పొంది లైసెన్సు తీసుకోవాల్సి ఉంది.

పట్టించుకోని అధికారులు
ప్రకాశం బ్యారేజి నుంచి అమరావతి వరకు ప్రతిరోజూ ఇసుకలోడుతో వేల పడవలు తిరుగుతున్నాయి. వాటిని ఇప్పటి వరకు ఇరిగేషన్‌ అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. సంవత్సరానికి కృష్ణాతీరంలో ఏదో ఒకచోట 10 నుంచి 15 పడవలు మునిగిపోతున్నాయి. గతంలో ప్రకాశం బ్యారేజి సమీపంలో ఇసుక పడవ మునిగిపోయింది. పడవ మునగకుండా ప్రయత్నిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు అధికారులు హడావుడి సృష్టిస్తున్నారు తప్ప, తిరిగే పడవలకు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయం పరిశీలించడం లేదు. ప్రస్తుతం ఉద్ధండరాయనిపాలెంలో మునిగిపోయిన పడవను ఇసుక మాఫియా బయటకు తీయకుండా వదిలేసింది. క్వారీలో ఎవరూ లేని సమయంలో దాన్ని బయటకు తీద్దామన్న ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండ్రోజుల పాటు పండుగ సెలవలు రావడంతో ఎవరికీ తెలియకుండా పడవను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు క్వారీలో కార్మికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతజరుగుతున్నా ఇరిగేషన్‌ అధికారులు మాత్రం ఆ చుట్టుపక్కల కనిపించకపోవడం విశేషం.

పడవ మునిగిన విషయం తెలియదు..
ఇసుక పడవ మునిగిన విషయమై ఇరిగేషన్‌ డీఈ గోపీనా«థ్‌ను వివరణ కోరగా, పడవ మునిగిన విషయం తమకు తెలియదని తెలిపారు. అనుమతులు ఇచ్చే విషయం మచిలీపట్నం పోర్టు వారు చూస్తున్నారని, కృష్ణానది ఎగువ ప్రాంతంలో సందర్శకులను తరలించే బోట్ల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌లు మాత్రమే మేం పరిశీలిస్తామన్నారు. మచిలీపట్నంలో అనుమతి తీసుకున్నది లేనిది ఎవరు పరిశీలిస్తారు అని ప్రశ్నించగా, ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోవాలని తెలిపారు.

మరిన్ని వార్తలు