చిన్నబోయిన కృష్ణమ్మ! 

19 Oct, 2023 05:28 IST|Sakshi

వర్షాభావంతో నాలుగు రాష్ట్రాల్లో నీటికి కటకట

2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్‌ ట్రిబ్యునల్‌ అంచనా

వర్షాభావంతో ఈ ఏడాది ఇప్పటివరకు 882 టీఎంసీలే లభ్యత

శ్రీశైలానికి ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన ప్రవాహం 120 టీఎంసీలే

2019–20 నుంచి 2022–23 వరకు నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో నీటి లభ్యత

సాక్షి, అమరావతి: నిండా నీటితో పరుగులు తీసే కృష్ణమ్మ ఈ ఏడాది చిన్నబోయింది. కృష్ణా నది పరీ­వాహక ప్రాంతాల్లో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన పాయతోపాటు కృష్ణా ఉప నదులైన కోయినా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, వేదవతి, భీమాలలోనూ వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరింది. బేసిన్‌లో బచావత్‌ ట్రిబ్యునల్‌ అంచనా వేసిన నికర జలాల లభ్యతలో ఈ ఏడాది సగం కూడా లభించడం లేదు.

నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరుకోవడంతో కృష్ణా బేసిన్‌లోని మహా­రాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో నీటికి కటకట ఏర్పడింది. సాగునీటికే కాదు తాగునీటికీ ఇబ్బందులు నెలకొన్నాయి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్‌ పర్వత శ్రేణుల్లో పురుడు పోసుకునే కృష్ణమ్మ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ మీదుగా 1,400 కి.మీ. పొడవున ప్రవహించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. 

శ్రీశైలం ప్రాజెక్ట్‌ చరిత్రలో రెండో కనిష్ట ప్రవాహం
కృష్ణా నదిలో ఏటా సగటున 75 శాతం లభ్యత (నికర జలాల) ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్‌ ట్రిబ్యునల్‌ అంచనా వేసింది. అందులో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల (ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299) చొప్పున కేటాయించింది. కానీ.. ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రధాన పాయతోపాటు ఉప నదుల్లో వరద ప్రవాహం పెద్దగా రాలేదు. దాంతో నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరుకుంది.

మహారాష్ట్రలో కృష్ణా ప్రధాన పాయ, కోయినా, దూద్‌గంగ, భీమా వంటి ఉప నదుల ద్వారా ఇప్పటివరకు ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి  298 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కర్ణాటకలో కృష్ణా ప్రధాన పాయతోపాటు ఘటప్రభ, మలప్రభ, వేదవతి, తుంగభద్ర ద్వారా ప్రాజెక్టుల్లోకి 427 టీఎంసీల ప్రవాహం వచ్చింది. బేసిన్‌లో దిగువన గల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల్లోకి కృష్ణా ప్రధాన పాయతోపాటు మూసీ, పాలేరు, మున్నేరు వంటి ఉప నదుల ద్వారా ఇప్పటివరకు కేవలం 157 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంది.

శ్రీశైలంలోకి 120 టీఎంసీల ప్రవాహం మాత్రమే వచ్చింది. ఇది ఆ ప్రాజెక్టు చరిత్రలో రెండో కనిష్ట ప్రవాహం కావడం గమనార్హం. 2015–16లో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన 58.69 టీఎంసీలే ఆ ప్రాజెక్టు చరిత్రలో కనిష్ట ప్రవాహం. కృష్ణా బేసిన్‌లో 2019–20 నుంచి 2022–23 వరకూ నాలుగేళ్లూ సమృద్ధిగా వర్షాలు కురవడంతో బచావత్‌ ట్రిబ్యునల్‌ అంచనా వేసిన దానికంటే అధికంగా జలాలు లభించాయి. ఈ ఏడాది నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరుకోవడ­ంతో బేసిన్‌లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు