ఎస్‌ఆర్‌సీ.. ఇసుకను దోచేసి..!

6 Jun, 2019 11:27 IST|Sakshi
ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన టిప్పర్లు

రోడ్డు పనులు ముగిసినా అక్రమంగా తవ్వకాలు

కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం

నిఘా వేసి టిప్పర్లను పట్టించిన గ్రామస్తులు

రోడ్డు పనుల ముసుగులో ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ బరి తెగిస్తోంది. పనులు పూర్తయినా ఇసుకను అక్రమంగా తోడేస్తూ ఇతర ప్రాంతాల్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటోంది.గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నిరాటంకంగా ఇసుక తవ్వకాలు చేపట్టింది. ఇప్పటికీ అదే పంథాలో ఇసుకను కొల్లగొడుతుండటంతో రైతులు, ప్రజలు ఆగ్రహించారు. ఇసుక అక్రమ రవాణాకు చెక్‌పెట్టేందుకు ఉద్యమించారు.  

పరిగి: జయమంగళి నది పరివాహక ప్రాంతమైన నేతులపల్లి వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు టిప్పర్లను గ్రామస్తులు అధికారులకు పట్టించారు. ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ పరిగి మండలంలో జాతీయ రహదారి పనులు చేపట్టింది. రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. అయినా నేతులపల్లివద్ద ఉన్న పెన్నానది, జయమంగళి నది పరివాహక ప్రాంతం నుంచి ఇసుక తరలిస్తూనే ఉన్నారు. ఎస్‌ఆర్‌సీ కంపెనీ వారు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను తోడేస్తూ కర్ణాటక, ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

నిషేధం ఉన్నా పట్టించుకోని కంపెనీ
పరిగి మండలంలోని జయమంగళి, పెన్నానది పరివాహక ప్రాంతాల్లోంచి ఇసుక తరలించరాదని రెవెన్యూ అధికారులు 15 రోజుల కిందట నిషేధం విధించారు. గ్రామాల్లో చాటింపు కూడా వేయించారు. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తామని ఆంక్షలు విధించారు.     

అనుమతులు లేకుండానే తవ్వకాలు
పరిగి మండలంలోని పెన్నా, జయమంగళి నదుల నుంచి అనుమతులు లేకుండానే ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వారు ఇసుక తవ్వకాలు చేపట్టి అక్రమంగా రవాణా చేస్తుండటంతో నేతులపల్లి గ్రామస్తులు ఆగ్రహించారు. జాతీయ రహదారి పనుల పేరుతో ఇలా అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

నిఘా వేసి పట్టుకున్న గ్రామస్తులు
పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నా కంపెనీ వారు మాత్రం ఇసుకను తోడేస్తుండటంతో బుధవారం వేకవజామున నేతులపల్లి గ్రామస్తులు నిఘా వేసి ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన మూడు ఇసుక టిప్పర్లను పట్టుకుని, రెవెన్యూ అధికారులకు సమాచారమందించారు. వీఆర్వో భారతి, వీఆర్‌ఏ సుబ్రమణ్యం అనుమతులు కేవలం ట్రాక్టర్‌లకు మాత్రమే ఇస్తామని, టిప్పర్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ తాము ఇవ్వబోమని స్పష్టం చేశారు. రంజాన్‌ పండుగ కావడంతో గురువారం అనుమతుల, ఇతర వివరాలను పరిశీలించి చట్టపరంగా చర్యలు చేపడతామని డిప్యూటీ తహసీల్దారు మహబూబ్‌ పీరాన్‌ పేర్కొన్నారు. పట్టుబడిన వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు