అందుబాటులోకి ఆధునిక వైద్యం 

22 Nov, 2023 06:14 IST|Sakshi

ప్రభుత్వ రంగంలో గుండె సంబంధిత చికిత్సల బలోపేతానికి సీఎం జగన్‌ చర్యలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో గుండె జబ్బులకు అత్యాధునిక చికిత్సలు అందించేందుకు సీఎం జగన్‌ ప్రభుత్వం సదుపాయాలు కలి్పస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు, కాకినాడ జీజీహెచ్‌లలో క్యాథ్‌ల్యాబ్‌ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఒక్కోచోట రూ.6 కోట్ల చొప్పున నిధులను వెచ్చిస్తోంది. కర్నూలు జీజీహెచ్‌లో ఇప్పటికే క్యాథ్‌ ల్యాబ్‌ యంత్రాలు అమర్చడం పూర్తయింది. ఈ వారంలోనే ట్రయల్‌ రన్‌ను ప్రారంభించబోతున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో యంత్రాలు అమర్చే ప్రక్రియ రెండు వారాల్లో పూర్తి కానుంది. 

గుండె వైద్య సేవల విస్తరణ 
మారిన జీవన విధానాలు, ఆహార అలవాట్ల కారణంగా చిన్న వయసు వారు సైతం గుండె జబ్బుల బారినపడుతున్నారు. గుండెపోటు బాధితులకు అత్యంత వేగంగా చికిత్స అందించడం ద్వారా మరణాల నియంత్రణపై సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనికోసం  ఎమర్జెన్సీ కార్డియాక్‌ కేర్‌ (ఈసీసీ) కార్యక్రమాన్ని కర్నూలు, గుంటూరు, తిరుపతి, విశాఖ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తోంది. మరోవైపు పాత 11 జీజీహెచ్‌లలో అన్నిచోట్ల కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ వాసు్కలర్‌ సర్జరీ (సీటీవీఎస్‌) సేవలు విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

11 పాత వైద్య కళాశాలలు ఉండగా.. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూలు కళాశాలలకు అనుబంధంగా పనిచేస్తున్న జీజీహెచ్‌లలో కార్డియాక్, సీటీవీఎస్‌ విభాగాలు సేవలందిస్తున్నాయి. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జీజీహెచ్‌లలో కార్డియాలజీ, సీటీవీఎస్‌ విభాగాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆయా విభాగాల ఏర్పాటు, సేవలు అందుబాటులోకి తేవడానికి వీలుగా 9 ఫ్రొఫెసర్, 9 అసోసియేట్, 7 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు కలిపి.. పర్ఫ్యూజనిస్ట్, క్యాథల్యాబ్, ఈసీజీ టెక్నీషియన్‌ ఇలా 94 పోస్టులను ఇప్పటికే మంజూరు చేశారు. ఈ ఐదు చోట్ల క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటుకు ఇప్పటికే డీఎంఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.  

సమస్య నిర్ధారణ.. చికిత్సలో కీలకం 
రక్తనాళాలు, హృదయ సంబంధిత సమస్యలను నిర్ధారించి.. చికిత్స నిర్వహించడంలో క్యాథ్‌ ల్యాబ్‌లదే ముఖ్య పాత్ర. గుండెపోటు సంబంధిత లక్షణాలున్న వారికి యాంజియోగ్రామ్‌ పరీక్షచేసి స్టెంట్‌ వేయడం, గుండె కొట్టుకోవడంలో సమస్యలున్న వారికి పేస్‌మేకర్‌ అమర్చడం క్యాథ్‌ ల్యాబ్‌ ద్వారానే చేపడతారు.  ప్రభుత్వం హబ్‌ అండ్‌ స్పోక్‌ విధానంలో అమలు చేస్తున్న ఈసీసీ కార్యక్రమంలో క్యాథ్‌ ల్యాబ్‌ సౌకర్యం ఉన్న బోధనాస్పత్రులు హబ్‌లుగా వ్యవహరిస్తున్నాయి. వీటికి ఏపీవీవీపీ ఆస్పత్రులను అనుసంధానం చేసి గుండెపోటు లక్షణాలతో వచ్చే వారికి గోల్డెన్‌ అవర్‌లో చికిత్సలు అందిస్తున్నారు. 

పూర్తిస్థాయిలో కార్డియాక్‌ కేర్‌ 
క్యాథ్‌ ల్యాబ్‌ ఏర్పాటుతో పూర్తి­స్థాయి ఎమర్జెన్సీ కార్డియాక్‌ కేర్‌ ఆస్పత్రిగా కర్నూలు జీజీహెచ్‌ రూపాంతరం చెందింది. గుండెకు సంబంధించిన అన్నిరకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. రాయలసీమ వాసులకు వైద్యపరంగా పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో క్యాథ్‌ల్యాబ్‌ కూడా అందుబాటులోకి రావ­డం శుభపరిణామం. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుంది.  – డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, సీటీవీఎస్‌ విభాగాధిపతి, కర్నూలు జీజీహెచ్‌   

మరిన్ని వార్తలు