లైసెన్సు లేకుండా వాహనంతో రోడ్డెక్కితే జైలుకే!

4 Jan, 2020 04:32 IST|Sakshi

సుప్రీంకోర్టు కమిటీ సూచనలతో కఠిన చర్యలకు ఉపక్రమించిన రవాణా శాఖ  

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను ఈ ఏడాది 20 శాతం తగ్గించాలని నిర్ణయం  

ఇక మరింతగా డ్రైవింగ్‌ లైసెన్సుల తనిఖీ  

ఇప్పటికే లైసెన్సుల జారీ ప్రక్రియ సులభతరం

త్వరలో అందుబాటులోకి సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లు

సాక్షి, అమరావతి:  డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా జైలుకు పంపనున్నారు. ఇప్పటివరకు జరిమానాలతో సరిపెట్టిన రవాణా శాఖ ఇక కఠినంగా వ్యవహరించనుంది. పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 88,872 మంది డ్రైవింగ్‌ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఈ మేరకు రవాణా శాఖ తాజాగా ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదికను రోడ్‌ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి అందజేసింది. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపేవారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టు కమిటీ సూచించింది. దీంతో ఏపీ రవాణా శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించనుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను ఈ ఏడాది 20 శాతం తగ్గించాలని రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా డ్రైవింగ్‌ లైసెన్సుల తనిఖీలను ఇక ముమ్మరంగా చేపట్టనున్నారు.  

లైసెన్సుల జారీ మరింత సులభతరం  
డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ ప్రక్రియను ఇప్పటికే సులభతరం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో మోటారు వాహన చట్టంలో సవరణలు చేసిన సమయంలోనే డ్రైవింగ్‌ లైసెన్సులకు విద్యార్హత నిబంధన తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో గతేడాది ఎనిమిదో తరగతి నిబంధనను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలగించింది. సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్సులు పొందడం మరింత సులభం కానుంది.  

మరిన్ని వార్తలు