అ"నగ"నగా..

5 Oct, 2017 12:40 IST|Sakshi
బురదలో గాలిస్తున్న గుడారి దుర్గ

మురుగుతోనే నిత్య సహవాసం

బంగారు వస్తువుల కోసం అన్వేషణ

ముప్పయ్యేళ్లుగా బతుకు పోరాటం

15 కుటుంబాల దీనావస్థ

తాతతండ్రుల నుంచి ఇదే జీవితం

ఇళ్లు, రేషన్‌కార్డులకు నోచని వైనం

నగల తయారీ దుకాణాల ముందున్న మురుగు కాలువల్లో దిగిపోతారు. భరించలేనంత దుర్గంధం భారమనుకోరు. దోమలు రక్తం తాగేస్తున్నా భయపడరు. గాజుపెంకులు గుచ్చుకుంటున్నా.. ఇనుప చువ్వలు గాయపరిచినా చలించరు. చేతులు మురుగును జల్లెడ పడుతుంటాయి. కళ్లన్నీ ఆశగా ఎదురు చూస్తుంటాయి. బంగారు వస్తువు మెరిసిందా.. ముఖాలు వెలిగిపోతాయి. ఆ పూటకి గంజినీళ్లు దొరుకుతాయి. ఎన్నాళ్లీ ఆకలి పోరాటం. ఎన్నాళ్లీ దైన్య జీవితం. గూడు లేదు.. కూడు దొరకదు. రేషన్‌కార్డుల్లేవు. పదిహేను కుటుంబాల దుర్భర బతుకు చిత్రమిది.

విజయనగరం, పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలోని నెయ్యిల వీధి, బొగ్గుల వీధి, రెడ్డి వీధుల్లోని బంగారు నగల తయారీ దుకాణాల ముందు మురుగు కాలువల్లో కొందరు ఏదో గాలిస్తుంటారు. చూసినవారు ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకున్నారేమో అనుకుంటారు. కాలువల్లో పూడిక తీస్తున్నారేమో అని మరికొందరనుకుంటారు. కానీ వాళ్లంతా ఆ మురుగులో కనిపించే బంగారు, వెండి వస్తువుల కోసం గాలిస్తున్నారనుకోరు.. అన్నం మెతుకుల కోసం రేయింబవళ్లు మురుగుతో సహవానం చేసే దీనులని ఊహించరు.

 రేణువు కనిపిస్తే పండగే
పట్టణంలోని వివిధ వీధుల్లో బంగారు పనివారున్నారు. వారు ఆభరణాలను తయారు చేసేటప్పుడు కంటికి కనిపించని బంగారు, వెండి, రాగి రేణువులు, పొడులు, జాతి రాళ్లు లాంటివి తుళ్లి కాలువల్లో పడుతుంటాయి. నగల తయారీ యజమానులు ఉదయం, సాయంత్రం వేళల్లో దుకాణాలను తుడిచి చెత్తను కాలువల్లో పోస్తుంటారు. అందులో కూడా చిన్నచిన్న వస్తువులు కాలువల్లో పడుతుంటాయి. వాటి కోసం దళిత కుటుంబాలు రోజూ కాలువల్లో దిగి అన్వేషిస్తుంటాయి. కాలువల్లో పూడికనంతా తీసి ఒకచోట గుమ్మరిస్తాయి.

దుర్గంధం భరిస్తూ..
కాలువల్లో అనేక వ్యర్థాలు, మురుగునీరు, మలమూత్రాలు ప్రవహిస్తూ తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంటాయి. ముక్కుపుటాలదిరిపోయే దుర్గంధం.. క్షణమైనా నిల్చోలేనంత వాతావరణం.. అయినా అదే వారికి బతుకు తెరువు. మురుగును గాలిస్తున్నప్పుడు గాజు పెంకులు, ఇనుప ఊచలు కాళ్లు, చేతులకు గుచ్చుకుంటున్నా భరిస్తారు. పొట్టకూటి కోసం మొండిగా అన్వేషణ కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో ఏ చిన్న వస్తువు కనిపించినా కష్టాన్ని మరిచిపోతారు. ఆ రోజు ఆకలి తీరిపోనుందని సంబరపడిపోతారు. ఇలా దొరికిన చిన్నచిన్న వస్తువులను పోగు చేసి అక్కడే ఉన్న వ్యాపారులకు విక్రయిస్తారు. చేతికి వచ్చిన రూ.200 లేదా రూ.300తో ఆ రోజుకు కావలసిన సరుకులు కొనుక్కుని ఇళ్లకెళ్తారు. ఏదీ దొరకని రోజు షావుకారి దగ్గర సరుకులు అప్పుగా తీసుకుంటారు.

చదువుకు నోచని పిల్లలు
గాసి కులస్తులు మురుగు కాల్వలను నమ్ముకుని మూడు దశాబ్దాలుగా బతుకుతున్నారు. చదువుకోకపోవడంతో ప్రభుత్వోద్యోగాలకు అవకాశాల్లేవు. బడి ఈడు పిల్లలను వెంటబెట్టుకుని ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. నిత్యం కాలువల్లో పనిచేసుకునే వీరికి రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు కూడా ముందుకు రావడం లేదు.

పింఛను లేదు
ప్రమాదంలో నా చేతి వేళ్లు పోయాయి. దివ్యాంగ పింఛను మాత్రం మంజూరు కాలేదు. దీనికి కారణం రేషన్‌ కార్డులు లేకపోవడమే. ఆధార్‌ కార్డు ఉన్నా రేషన్‌కార్డు లేనిదే పింఛను రాదంటున్నారు. మా గాసీ కులస్తులకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలి. అర్హులకు ఉపాధి అవకాశాలను కల్పించాలి.     – నాగవంశం నాగరాజు, పార్వతీపురం

పిల్లలకు చదువు లేదు
మూడు దశాబ్దాలుగా తాత ముత్తాతల నుంచి ఈ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. మా పిల్లలు చదువులకు దూరమౌతున్నారు. మాకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే పిల్లల్ని చదివించేవాళ్లం. పట్టణంలో ఉపాధి దొరక్క జీవితాంతం ఇదే పనిని నమ్ముకోవల్సి వస్తోంది. – పడాల మజ్జి, పార్వతీపురం

రోగాలతో మరణాలు
నిత్యం మురుగుతో సహవాసం వల్ల రోగాల బారిన పడుతున్నాం. మా పెద్దలు, తాతలు, తండ్రులు ఈ వృత్తి వల్లే జబ్బుపడి చనిపోయారు. కాలువల్లో మురుగును గాలిస్తున్నప్పుడు గాజుపెంకులు, ఇంజక్షన్‌ సూదులు, మేకులు, అల్పీలు, రాళ్లు గుచ్చుకుని ఇన్‌ఫెక్షన్‌ చేస్తాయి. ఆస్పత్రికి వెళ్లి ఆ పూటకు మందులు వేసుకుని తెల్లవారగానే కూటి కోసం కాలువల్లో దిగాల్సి రావడం తప్పనిసరైంది. – పడాల సురేష్, పార్వతీపురం

కష్టం మరిచిపోతాం
మరుగు కాలువల్లో పూడిక తీసేటప్పుడు ఎంత దుర్గంధం వెదజల్లుతున్నా.. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. బంగారు రేణువు దొరికితే చాలు కష్టాన్ని మరిచిపోతాం. ఆ ఆశే మాతో ఈ పని చేయిస్తోంది. రోజంతా ఇసుక, బురదను జల్లెడ పడితే చిన్న చిన్న రేణువులు దొరికితే ఆ పూట గడుస్తుందని ఆనందిస్తాం. – పడాల మురళి, పార్వతీపురం

గంజినీళ్లకే కష్టం
ముప్పయ్యేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం. ఏ పండగొచ్చినా అందరూ విందు భోజనాలు చేస్తారు. మా జీవితంలో మాత్రం సాధారణమైన రోజులు, పండగ రోజులు ఒకేలా ఉంటాయి. మురుగులో లభించిన బంగారు రేణువులతో ఆ పూట గడవడమే కష్టమవుతుంటే పండగ కూడా చేసుకోవడం కష్టమౌతుంది. కుటుంబ పోషణ భారమై పూట గడవడమే కష్టమైన మా బతుకులకు పిల్లలను చదివించుకొనే స్తోమత లేక అవస్థలు పడుతున్నాం. వంశ పారంపర్యంగా ఇదే వృత్తిని వాళ్లకు కూడా అంటగట్టాల్సి రావడం మా దౌర్భాగ్యం. – పడాల గంగమ్మ

రేషన్‌ కార్డుల్లేవు
గాసీ కులస్తులమైన మేము సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటున్నాం. రేషన్‌ కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వ సహకారం అందడం లేదు. మాకు రేషన్‌ కార్డుల్లేక ఎలాంటి రుణాలు కూడా రావడం లేదు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడం లేదు. – పడాల సత్యవతి, పార్వతీపురం

మరిన్ని వార్తలు