గిరిజన వర్సిటీ మాస్టర్‌ ప్లాన్‌ రెడీ

12 Nov, 2023 04:12 IST|Sakshi

తొలి విడతగా భవన నిర్మాణాలకు రూ.300.50 కోట్ల కేటాయింపు

25 విభాగాలు, 40 తరగతి గదులు

వెయ్యిమందికి సరిపడేలా ఆడిటోరియం

వచ్చే విద్యాసంవత్సరం నూతన భవనాల్లోనే తరగతులు 

విజయనగరం అర్బన్‌: ఉమ్మడి విజయనగరం జిల్లా మెంటాడ,  దత్తిరాజేరు మండలా­ల్లోని 562 ఎకరాల విస్తీర్ణంలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి మాస్టర్‌  ప్లాన్‌ సిద్ధమైంది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో యూనివర్సి­టీ నిర్వహణకు అవసరమైన.. విస్తరణకు అనువుగా భవనాల నిర్మాణ ప్రతిపాదనలను ఉన్నతాధికా­రు­ల అనుమతి కోసం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ టీవీ కట్టిమణి పంపించారు. తొలివిడతగా కేటా­యిం­చిన రూ.300.50 కోట్ల వ్యయంతో యూని­వర్సి­టీకి ప్రాథమికంగా అవసరమైన నిర్మాణాలు చేపట్టనున్నారు. వర్సిటీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న వివిధ కోర్సులకు చెందిన 20 విభాగాల్లో ప్రతి ఐదింటికి 10 చొప్పున 40 తరగతి గదులు నిర్మిస్తారు.

విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా 500 మందికి సరిపడేలా వసతి గృహాలు, వెయ్యి మందికి సరిపడే ఆడిటోరియం, 300 మంది సామర్థ్యం గల మరో ఆడిటోరియం, అడ్మినిస్ట్రేషన్‌ భవనం, సెంట్రల్‌ లైబ్రరీ, స్కిల్‌ సెంటర్, ఇండోర్, అవుట్‌డోర్‌ స్టేడియాలు, టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నివాస భవనాలు 100 చొప్పున నిర్మించేందుకు వీసీ ప్రతిపాదనలు పంపించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త భవనాల్లో తరగతులు నిర్వహించేలా యుద్ధప్రాతిపదికన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. 

కొత్త భవనాల్లోనే తరగతులు 
వచ్చే విద్యా సంవత్సరం కొత్తగా నిర్మించే భవనా­ల్లోనే తరగతులు నిర్వహించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం యూనివర్సిటీలో 8 పీజీ, 6 అండర్‌ పీజీ కోర్సులు నడుస్తున్నాయి. మరో రెండు కోర్సులను వచ్చే విద్యా సంవత్సరానికి కొత్తగా తీసుకొస్తాం. ఇందుకోసం 77 మంది బోధన, 89 మంది బోధనేతర సిబ్బంది అవసరం. ప్రస్తుతం బోధన సిబ్బంది 18 మంది, బోధనేతర సిబ్బంది 12 మంది వరకు ఉన్నారు. మిగిలిన పోస్టుల నియామ­కానికి ప్రతిపాద­నలు పంపించాం.  – ప్రొఫెసర్‌ టీవీ కట్టిమణి, కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ 

మరిన్ని వార్తలు