చి‘వరి’కి దగా!

9 Dec, 2013 00:43 IST|Sakshi

యాచారం, న్యూస్‌లైన్ : రైతుల నమ్మకాన్ని విత్తన వ్యాపారులు వమ్ము చేశారు. నాణ్యత లేని విత్తనాలు అంటగట్టి నిలువునా ముంచేశారు. కొత్త రకం విత్తనం, పంట దిగుబడి అధికంగా వస్తుందని చెబితే నమ్మి కొనుగోలు చేసిన అన్నదాతలు దారుణంగా మోసపోయారు. విత్తనాలు నారుమడిలో పోస్తే పక్షం రోజులు దాటినా మొలకెత్తక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యాపారుల మాటల నమ్మి మోసపోయామని రైతన్నలు లబోదిబోమంటున్నారు. మండలంలో మూడేళ్ల తర్వాత సంవృద్ధిగా వర్షాలు కురవడంతో రైతులు అధికంగా వరి సాగు చేయడానికి సిద్ధమయ్యారు. వ్యవసాయాధికారులు అవసరమైన వరి విత్తనాలు అందుబాటులో ఉంచకపోవడంతో అదను పోతుందనే ఆతృతతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసుకొని నారుమడులు పోశారు. మండలంలోని మాల్, ఇబ్రహీంపట్నంలతోపాటు మొత్తం 20గ్రామాల రైతులు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని వ్యాపారుల వద్ద వరి విత్తనాలు కొనుగోలు చేశారు. అయితే నారుమడులు పోసినా సగానికి పైగా మొలకలు రాకపోవడంతో మళ్లీ కొత్తవి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 పదిహేను రోజుల క్రితం తమ్మలోనిగూడ గ్రామానికి చెందిన పలువురు రైతులు నగరంలోని మాదాపూర్‌లోని దుకాణంలో ఓం సీడ్స్ కంపెనీకి చెందిన వరి విత్తనాలను 25 కిలోల బ్యాగు రూ.720 చొప్పున కొనుగోలు చేశారు. నారుమడులు పోసిన పక్షం రోజుల వరకు కూడ కరిగట్లలో మొలకలెత్తనే లేదు. దీంతో  రైతులు విత్తనాల బ్యాగుపై ఉన్న ఫోన్ నంబర్‌లో సంప్రదిస్తే నాణ్యమైన విత్తనాలనే ఇచ్చాం...మీరే ఎలా నారుమడి పోశారోనని బదులివ్వడంతో విస్తుపోయారు. కేవలం తమ్మలోనిగూడ గ్రామంలోనే కాకుండా చింతపట్ల, మాల్, నల్లవెల్లి, నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, నందివనపర్తి తదితర గ్రామాల్లోనూ చాలామంది రైతులు వరి విత్తనాలను ప్రైవేటులోనే కొనుగోలు చేసి నారుమళ్లు పోశారు. కొన్ని చోట్ల ఆలస్యంగా మొలకెత్తగా, మరి కొందరి పొలాల్లో పదిహేను రోజులు దాటినా కూడా మొలకెత్తలేదు. దీంతో రైతులు మళ్లీ రూ.వందలాది ఖర్చులు చేసి విత్తనాలు తెచ్చి నారుమడులు పోసే పరిస్థితులు వచ్చాయి.  ఇంత జరుగుతున్న వ్యవసాయాధికారుల్లో మాత్రం చలనం లేకపోవడం అన్నదాతలకు పెద్ద శాపంగా మారింది.
 
 నాణ్యమైనవని కొంటే...
 అందుబాటులో ప్రభుత్వ విత్తనాలు లేకపోవడంతో నగరానికి వెళ్లాల్సి వచ్చింది. వ్యాపారులు వరి విత్తనాలు నాణ్యమైనవని, దిగుబడికి ఢోకా ఉండదని చెప్పడంతో ఓంసీడ్స్ కంపెనీ విత్తనాలు కొనుగోలు చేశాను. నాలుగు సంచులకు రూ.3వేల దాకా ఖర్చు చేశాను. మడి కడితే వారం దాటినా కూడా మొలకలు రాలేదు. రోజూ ఉదయం, సాయంత్రం నీటి తడి అందించినా ఫలితం లేకపోయింది.
 - హరికృష్ణ, తమ్మలోనిగూడ
 
 మోసపోయాను..
 ఇరవయ్యేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఎన్నడూ ఇలా జరగలేదు. అందరూ ఓంసీడ్స్ వరి విత్తనాలు నాణ్యమైనవి అంటుంటే వెళ్లి కొనుగోలు చేశాను. ఈసారి విత్తనాల ఎంపికలో దారుణంగా మోసపోయాను. కరిగట్టు పోసి పక్షం రోజులు దాటినా వరి మొలకెత్తలేదు. విత్తనాల కోసం ఖర్చు చేసిన రూ.2వేలు నష్టపోయాను. అధికారులు స్పందించి నాసిరకం విత్తనాలు అంటగట్టిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
 - భంద్రయ్య, తమ్మలోనిగూడ

>
మరిన్ని వార్తలు