అంగీకారంతో పెళ్లాడినా.. ఏడేళ్లు శిక్ష

31 Oct, 2018 11:45 IST|Sakshi

బాల్య విహాహాలపై జిల్లా జడ్జి మౌలాన

లైంగింక వేధింపులకు తప్పదు భారీ మూల్యం

మంచి సమాజాన్ని పిల్లలకు అందించాలి

స్కూల్‌ స్థాయిలోనే ‘ఫోక్సో’పై చెప్పండి: ఎస్పీ

చిత్తూరు అర్బన్‌: ‘‘మైనర్‌ బాలికలను వారి అంగీకారంతో పెళ్లాడినా.. కాపురం చేసినా అది చట్టరీత్యా నేరమే. దీనికి ఏడేళ్లకు మించి జైలుశిక్ష పడుతుంది. పిల్లల్ని లైంగిక దాడుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. మం చి సమాజాన్ని నిర్మించుకుని అందులో పిల్లల్ని స్వేచ్ఛగా బతకనిద్దాం..’’ అని జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి మౌలాన్‌ జునైద్‌ అహ్మద్‌ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో ‘పిల్లలపై లైంగిక వేధిం పుల నిరోధక చట్టం (ఫోక్సో)’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ, విద్యాశాఖ సంయుక్తంగా ఇందులో పాల్గొన్నాయి. సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ పిల్లల్ని లైంగిక వేధింపుల నుంచి కాపాడే చట్టాలపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు. నేరాలను తగ్గించడమే లక్ష్యంగా పోలీసుశాఖ, విద్యాశాఖ అవగాహన కల్పించాలన్నారు. చెడు ప్రభావాల నుంచి పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ 18 ఏళ్ల వయస్సు నిండని బాలికలను వివాహమాడి, వారితో కాపురం పెట్టినా దానికి చట్టబద్ధత ఉండదన్నారు.

అమ్మాయి సమ్మతంతోనే పెళ్లి జరిగినా చెల్లదని, పైగా పెళ్లాడిన వ్యక్తిపై కిడ్నాప్, రేప్‌ కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు. అసలు పిల్లలపై లైంగిక దాడులు అరికట్టాలంటే పాఠశాల స్థాయిలోనే ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. పోలీసు శాఖ ఇందులో బాధ్యతగా పనిచేస్తోందని.. గుడ్, బ్యాడ్‌ టచ్‌ పేరిట తోడేలు ముసుగులో ఉన్న మగాళ్ల వేషాలను వివరిస్తూ వెయ్యికి పైగా పాఠశాలల్లో పిల్లలకు వీడియోల ద్వారా అవగాహన కల్పించామన్నారు. సమాజంలో ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు పిల్లలు ధైర్యంగా మాట్లాడగలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగయ్య మాట్లాడుతూ పిల్లలో వచ్చే శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావం వల్ల యుక్త వయస్సులో ఆకర్షణకు లోనవుతుంటారన్నారు. ఈ ఆకర్షణ బాధ్యతవైపు నడిపించేలా తల్లిదండ్రులు, గురువులు ప్రేరణ కల్పించాలన్నారు. అప్పుడే చెడు మార్గాలవైపు వెళ్లకుండా లక్ష్యాలను కేటా యించుకుని జీవితంలో నిలదొక్కుకుంటారన్నా రు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగశైలజ, ఏఎస్పీ సుప్రజ, మహిళా స్టేషన్‌ డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పలు సూచనలు, సలహాలిచ్చారు.

మరిన్ని వార్తలు