Ujjain Horror Case: అమానవీయం.. రోడ్డుపై అత్యాచార బాధితురాలు, సాయం కోరినా కనికరించని వైనం

27 Sep, 2023 11:23 IST|Sakshi

సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఇంటా.. బయటా నిత్యం ఏదో ఒకచోట వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. దాడులు, వేధింపులు, అఘాయిత్యాలు, అత్యాచారాలతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై నేరాలూ తగ్గడం లేదు, దుర్మార్గుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావడం లేదు.  

తాజాగా మధ్య ప్రదేశ్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగుచూసింది. మైనర్‌(12) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి ఒడిగట్టారు. అత్యాచార బాధితురాలు ఒంటిపై గాయాలతో, ప్రతి ఇంటికి వెళ్తూ సాయం కోసం అర్తించే దృశ్యాలు సోషల్‌ మీడియాలో కలవరం రేపుతున్నాయి. అర్థ నగ్నంగా, రక్తస్రావంతో బాలిక బాధపడుతూ కనిపిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ  దారుణ ఘటన ఉజ్జయిని సమీపంలోని బాద్‌నగర్‌ రహదారిపై చోటుచేసుకుంది. ఈ దిగ్బ్రాంతికర దృశ్యాలు రోడ్డుపై ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.

షాక్‌కు గురిచేస్తోన్న ఈ వీడియోలో 12 ఏళ్ల వయసున్న ఓ బాలిక ఒంటిపై ఓ క్లాత్‌తో వీధుల్లో తిరుగుతూ కనిపిస్తుంది. రోడ్డు మీద ప్రజలు ఆమెను చూస్తూ ఉన్నారే తప్ప సాయం చేసేందుకు మాత్రం ముందుకు రాకపోవడం మరింత సిగ్గుచేటు. సహాయం కోసం ఓ వ్యక్తిని సంప్రదించగా అతను బాలికను వెళ్లిపోమ్మంటూ నెట్టేయడం వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. చివరకి బాధితురాలు ఓ ఆ‍శ్రమానికి చేరుకుంది. అక్కడ ఓ పూజారి ఆమెను చూశారు. ఆమెపై టవల్‌ కప్పి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు జరిపిన పరీక్షల్లో బాలికపై త్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.

బాలిక ఒంటిపై తీవ్ర గాయాలుండంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌ తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి చర్యలు తీసుకుంటామని ఉజ్జయిని పోలీస్ చీఫ్ సచిన్ శర్మ తెలిపారు.  బాలిక ఎక్కడ అఘాయిత్యం జరిగిందో  ఇంకా తెలియరాలేదని, దీనిపై విచారణ జరిపి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతానికి బాధితురాలి వివరాలు కూడా తెలియలేదని అయితే ఆమె మాటలు చూస్తుంటే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందినట్లు తెలుస్తుందన్నారు.

ఈ భయానక సంఘటన మధ్యప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న ఘోరాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. 2019 నుంచి 2021 మధ్య మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో అత్యధికంగా మహిళలు, బాలికల అదృశ్యం కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2021లో మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువ అత్యాచార ఘటనలు (6,462) నమోదయ్యాయి.  వాటిలో 50 శాతానికి పైగా నేరాలు మైనర్లపైనే జరిగాయి. అంటే సగటున రోజుకు 18 అత్యాచారాలునమోదవుతున్నాయి.

మరిన్ని వార్తలు