ఫలించిన ఎమ్మెల్యే మధ్యవర్తిత్వం

26 Jun, 2019 11:16 IST|Sakshi
కార్మికులు, పరిశ్రమల యజమానులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అప్పలరాజు

తెరుచుకున్న జీడి పరిశ్రమలు

జీడి పరిశ్రమల యజమానులు, కార్మికులతో మాట్లాడిన పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

పనుల్లోకి హాజరైన కార్మికులు

సాక్షి, కాశీబుగ్గ (శ్రీకాకుళం): వారంరోజులుగా మూతవేసిన జీడి పరిశ్రమలను తెరవాలని, తక్షణమే పనులకు హాజరుకావాలని పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు సూచించారు. 12 శాతం కార్మికులకు పెంచాల్సిన వేతన ఒప్పందం అమలు చేయకుండా పరిశ్రమ యజమానులు కాలయాపన చేస్తుండడంతో పరిశ్రమలు మూతబడిన విషయం తెలిసిందే. మంగళవారం పరిశ్రమల యజమానులకు, కార్మికులతో ఎమ్మెల్యే సీదిరి తన స్వగృహామంలో మాట్లాడారు. రెండేళ్లకు ఒక్కసారి కుదుర్చుకునే వేతన ఒప్పందం ప్రకారం యజమానులు అమలు చేయకపోవడంతో మూకుమ్మడిగా బంద్‌ పాటించామని కార్మికులు ఎమ్మెల్యేకు వివరించారు. యాజమాన్యం మొండి వైఖిరి తగదని ఒప్పందం ప్రకారం 12 శాతం వేతనాలు పెంచాలని విన్నవించారు.

పరిశ్రమల యజమానులు మాట్లాడుతూ తిత్లీ తుపాను సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఆర్థికంగా చితికిపోవడంతో తగిన గడువు కావాలని కోరారు. కార్మికులకు, పరిశ్రమ యజమానులకు ఎమ్మెల్యే నచ్చజెప్పి ప్రస్తుతం పరిశ్రమలు తెరవాలని, ప్రొససింగ్‌కు ఆటంకం కలగకుండా కార్మికులు సైతం పనులకు హాజరుకావాలని ఆదేశించారు. వారం రోజులపాటు ఆలోచించి కార్మికుల డిమాండ్‌ ప్రకారం యాజమాన్యంతో ఆ ఒప్పందానికి సంతకాలు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌ అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, శాశనాపురి శ్రీనివాస్, యరుకోలు సుధాకర్, కాష్యూ లేబర్‌ ఆసోసియేషన్‌(కార్మికులు) అధ్యక్షుడు బొంపల్లి సింహాచలం, కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, సభ్యులు కోనారి రాము, పెంట అసిరినాయుడు, గోరుశెట్టి అమ్మన్న, వంకల రామయ్య, బొమ్మాళి తాతయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆదేశాలు పాటించిన యజమానులు, కార్మికులు
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో, పరిసర ప్రాంత పల్లెల్లో ఉన్న 300లకు పైగా జీడి పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల యజమానులు, కార్మికులతో ఎమ్మెల్యే సీదిరి ఆధ్వర్యంలో  నిర్వహించిన చర్చల అనంతరం పరిశ్రమలు తెరుచుకున్నాయి. వేతన ఒప్పందానికి వారం రోజులు గడువు ఇచ్చినప్పటికీ.. ముందుగానే పరిశ్రమలు తెరవాలని యజమానులకు, పనుల్లోకి హాజరుకావాలని కార్మికులకు ఎమ్మెల్యే చెప్పడంతో అందరూ వారి పనుల్లోకి హాజరయ్యారు. బుధవారం ఉదయం నుంచి కటింగ్‌ మిషన్‌ కార్మికులు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు