సాఫీగా సమైక్య బంద్

4 Jan, 2014 00:58 IST|Sakshi
సాఫీగా సమైక్య బంద్

=వైఎస్సార్ కాంగ్రెస్ నేతృత్వంలో విజయవంతం
 =నాయకులు, కార్యకర్తల దీక్షతో కార్యక్రమం ప్రశాంతం
 =బంద్ బాట పట్టిన టీడీపీ, ఎన్జీవోలు, విద్యార్థులు
 
విభజన కుయుక్తులను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు మేరకు జిల్లాలో శుక్రవారం తలపెట్టిన బంద్ సాఫీగా కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టడంతో దైనందిన కార్యకలాపాలకు విఘాతం కలిగింది. రూరల్ జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సమైక్య కాంక్ష విస్తృత స్థాయిలో వ్యక్తమయింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా బంద్ బాట పట్టింది. విభజన ఎత్తుగడను నిరసిస్తూ ఎన్జీవోల గళం కూడా నలుదిశలా వినిపించింది.  
 
సాక్షి, విశాఖపట్నం : ధర్నా, రాస్తారోకోలతో జిల్లా మరోసారి దద్దరిల్లింది. సమైక్య నినాదాలతో హోరెత్తింది. సమైక్యత కోసం తొలి నుంచి పోరాడుతున్న  వైఎస్సార్ సీపీ బంద్‌ను విస్తృత స్థాయిలో నిర్వహించింది. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కార్యకర్తల శ్రేణి బంద్‌ను దీక్షతో నిర్వహించింది. దాంతో బంద్ సజావుగా సాగింది.  ఏపీ ఎన్జీఓలు, టీడీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, విద్యార్థి జేఏసీ  నేతలు కూడా వేర్వేరుగా బంద్‌లో పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓలు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాన్నీ వెలవెలబోయాయి. అనకాపల్లిలో వైస్సార్‌సీపీ  ఆధ్వర్యాన అనకాపల్లి పట్టణంలో బంద్ నిర్వహించారు.  

నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో నియోజకవర్గ నాయకుడు కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) పాల్గొన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు, కోర్‌కమిటీ సభ్యులు బుద్ద నాగజగదీశ్వరరావు, మళ్ల సురేంద్రల నేతృత్వంలో బంద్ పాటించారు. అనకాపల్లి  నెహ్రూచౌక్ జంక్షన్‌లో తెలుగుతల్లి విగ్రహం వద్ద  సమైక్యాంధ్ర విద్యార్థి యువజన జేఏసీ ప్రతినిధులు తెలంగాణా బిల్లును తగులబెట్టారు. నర్సీపట్నంలో నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో  చేపట్టిన బంద్‌ను పోలీసులు భగ్నం చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన యలమంచిలిలో బంద్ ప్రశాంతంగా జరిగింది.

బంద్‌లో సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. కొక్కిరాపల్లి జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సోనియా గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.  మునగపాకలో బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో,  అచ్యుతాపురంలో ప్రగడ నాగేశ్వరరావు ఆద్వర్యాన బంద్ జరిగింది.   టీడీపీ ఆధ్వర్యంలో అచ్యుతాపురం కూడలిలో శుక్రవారం కార్యకర్తలు సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నాచేశారు. చోడవరంలో పార్టీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావుతో పా టు నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొని చోడవరంలో బంద్ నిర్వహించారు.

పాయకరావుపేటలో వైఎస్సార్‌సీపీ నేతలు  ధనిశెట్టి బాబూరావు, చిక్కాల రామారావు ఆధ్వర్యంలో పాయకరావుపేటలో బంద్ నిర్వహించారు. జాతీ యరహదారిపై ర్యాలీ నిర్వహించారు. నక్కపల్లిలో వీసం రామకృష్ణ, అడ్డురోడ్డు జాతీయరహదారిపై కొణతాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు.  పాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

మాడుగులలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు ఆధ్వర్యంలో కె.కోటపాడు, ఆనందపురం గ్రామాల్లో బంద్ చేశారు.పాడేరులో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త  గిడ్డి ఈశ్వరి, నాయకులు వంజంగి కాంతమ్మ, సీకరి సత్యవాణి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలంతా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో బైఠాయించారు.  టీడీపీ నేత,మాజీ మంత్రి ఎం మణికుమారి  ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అరకులోయలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కిడారి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, రాస్తారోకో జరిగాయి. విశాఖ నగరంలో బంద్ ప్రశాంతంగా, సాఫీగా సాగింది.
 

మరిన్ని వార్తలు