కాలు పెడితే చాలు కాటు వేసి మాయమవుతోంది..

15 Oct, 2018 11:20 IST|Sakshi

నెలలో 14 మందికి కాటు  

ఒకరు మృతి 

పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్న జి.సింగవరం గ్రామస్తులు

కర్నూలు(హాస్పిటల్‌): పొలాల్లోకి వెళ్లాలంటే భయం. పొదల్లో కాలు పెట్టాలంటే జంకు. కలుపు తీయాలంటే వణుకు. ఎక్కడ, ఏ మూలన పాము పొంచి ఉంటుందో తెలీదు. కాలు పెడితే చాలు అమాంతం కాటు వేసి మాయమవుతోంది. ఇలా కర్నూలు మండలం జి. సింగవరం గ్రామంలో నెలరోజులుగా జరుగుతోంది.  జి. సింగవరం గ్రామంలో కేసీ కాలువ కింద వరి, మొక్కజొన్న, కంది, పత్తి వంటి పంటలు విస్తృతంగా పండిస్తారు. జూన్‌ మాసం నుంచే కేసీ కాలువకు నీరు రావడంతో ఖరీఫ్‌ సీజన్‌లో అధికంగా వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట ఏపుగా పెరిగింది. మొక్క జొన్న కూడా మూడునెలల పైరు. నెలరోజుల క్రితం గ్రామంలో భారీ వర్షం కురిసింది.

మరుసటి రోజు నుంచి గ్రామంలో ఎక్కడ చూసినా కట్ల పాములు దర్శనమివ్వసాగాయి.  వరి, మొక్క జొన్న పొలాల్లో ఎక్కడ చూసినా పాములే. గ్రామస్తులు చూసిన వెంటనే చంపేస్తూ వచ్చారు. కానీ దాక్కున్న పాములు గ్రామస్తులను కాటేస్తున్నాయి. నెలలో 14 మందిని కాటేశాయంటే అతిశయోక్తి కాదు. వారం క్రితం ఒకరు మృతి చెందగా, మిగిలిన వారు చికిత్స చేయించుకొని కోలుకున్నారు. మరికొందరు గ్రామంలో నాటు మందు తీసుకొని బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు.  

పాముకాటుకు గురైన కొందరు గ్రామస్తులు 
1. కుద్రత్‌వలి(55):  మొక్కజొన్న పొలంలో గడ్డి కోస్తుండగా పాము కాటేసింది. 

2. ఇ. రామన్నగౌడ్‌ భార్య ఇ. సుజాత(26): రెండుసార్లు పాము కాటుకు గురైంది. ఒకసారి పొలంలో కలుపు తీస్తుండగా, మరొకరసారి పశువులకు నీళ్లు తాగించుకుని రావడానికి వెళ్లినప్పుడు తుంగభద్ర నదిలో కాటేసింది.  

3. కె. శ్రీనివాసులు భార్య కె. మహేశ్వరి(32) పొలంలో కలుపు తీస్తుండగా పాముపై తొక్కింది. అయితే  అదృష్టవశాత్తు పాము కాటేయలేదు. 

4. ఎం.చిరంజీవి భార్యకు పొలంలో పాము కాటేసింది. 

5. ఎం.రామాంజనేయులు భార్య ఎం.రామేశ్వరమ్మ(30) పొలంలో పనిచేస్తుండగా కాటేసింది. 

6. చాకలి నాగేశ్వరమ్మ(55) పొలంలో కలుపు తీస్తుండగా పాము కాటుకు గురైంది. వారం 

రోజుల పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ వారం రోజుల క్రితం మరణించింది.  

7. పుండుకూర మద్దిలేటి (35) పొలానికి మందు పిచికారీ చేస్తుండగా కాటేసింది.   

మరిన్ని వార్తలు