నేడు కొలువుదీరనున్న కొత్త సర్పంచులు

2 Aug, 2013 03:34 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడింది. పంచాయతీ ఎన్నికల్లో కొత్త సర్పంచ్‌లను ఎన్నుకోవడంతో వారు శుక్రవా రం కొలువుదీరనున్నారు. వారికి సమస్యలు స్వాగతం పలుకుతున్నా యి. ‘ప్రత్యేక’ పాలనలో సాధారణ, 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ నిధులు ఖర్చు చేయడానికి నిబంధనలు ప్రతిబంధకాలుగా మారడంతో పల్లోల్లో అభివృద్ధి పడకేసింది. గ్రామాలు పారిశుధ్యలోపంతో కనిపించాయి. ప్రజలు వ్యాధులతో తల్లడిల్లారు. నాలుగైదు గ్రామాలకు ఒక ప్రత్యేకాధికారిని నియమించడంతో పంచాయతీలపై దృష్టి సారించలేదనే విమర్శలు ఉన్నాయి. రేండేళ్ల అనంతరం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, మూడు విడతల్లో ఎన్నికైన కొత్త పాలకవర్గం శుక్రవారం కొలువుతీరనుంది.
 
 పల్లెల్లో నిలిచిన పురోగతి
 గ్రామ పంచాయతీల ఎన్నికలు రెండేళ్లుగా నిలిచిపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా విడుదలయ్యే సుమారు రూ.12 కోట్ల నిధులకు గ్రహణం పట్టింది. ఆర్థిక సంఘంతోపాటు సాధారణ, టీఎఫ్‌సీ, ఎస్‌ఎఫ్‌సీ, సాధారణ నిధుల విడుదల, వినియోగంలో జాప్యం జరిగింది. ఏడాది క్రితం వరకు గ్రామ పంచాయతీల ఖాతాల్లో వివిధ పద్దుల కింద విడుదలైన రూ.6.31 కోట్ల నిధులు ఖజానాలోనే మూలిగాయి. 13వ ఆర్థిక సంఘం నిధుల్లో 40 శాతం శానిటేషన్ కోసం ఖర్చు చేయవచ్చని నిబంధనలున్న అధికారులు మిన్నకున్నారు. ఎస్‌ఎఫ్‌సీ, సాధారణ నిధులతో భవనాలు, రోడ్లు మరమ్మతులతోపాటు ప్రత్యేక పరిస్థితుల్లో రక్షిత మంచినీరు సరఫరా, పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్ కోసం వినియోగించే వెసులుబాటు ఉంది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య, జిల్లా పరిషత్‌ల ద్వారా ఖర్చు చేసేందుకు నిధులు కేటాయించే అవసరం కూడా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీల అభివృద్ధి, పారిశుధ్యం, శానిటేషన్‌పై దృష్టి సారించాల్సిన ‘ప్రత్యేక’ అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.
 
 పేరుకుపోయిన బకాయిలు
 రెండేళ్ల నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోవడంతో పల్లెల్లో అభివృద్ధి మందగించింది. ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడం, బకాయిలు పేరుకుపోవడానికి పాలకవర్గం లేకపోవడమే ప్రధాన కారణం. మేజర్ గ్రామ పంచాయతీల్లో బడాసంస్థలు, ప్రజాప్రతినిధులు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. 2010-11 సంవత్సరం వసూళ్లకు 10 శాతం అదనంగా ఆస్తిపన్ను వసూలు చేయడం లక్ష్యంగా కాగా మార్చి 31 నాటికి రూ.7.84 కోట్లు వసూలయ్యాయి. 2011-12లో రూ.16.60 కోట్ల ఆస్తిపన్ను లక్ష్యంగా పెట్టుకున్నారు. 2012-13లోరూ.21.60 కోట్లు వసూలు లక్ష్యం కాగా, మార్చి మాసాంతం నాటికి రూ.6 కోట్ల మేరకు వసూలైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
 
 ‘పంచాయతీ’ల పాలనకు ప్రతిబంధకంగా కార్యదర్శుల ఖాళీలు
 ఆస్తిపన్ను వసూలుతోపాటు పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడటానికి పంచాయతీ కార్యదర్శుల ఖాళీలు కూడా కారణం. రెండేళ్లుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీల భర్తీ కోసం పంచాయతీ అధికారులు, కలె క్టర్లు పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదు. పంచాయతీల అభివృద్ధిలో కీలకమైన పంచాయతీ కార్యదర్శుల ని యామకంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న వి మర్శలు ఉన్నాయి. అక్రమ లేఔట్లు, ఆస్తిపన్ను ఎగవేత, అ క్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కార్యదర్శుల కొరత కారణం గా ఏమి చేయలేకపోతున్నామని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలకు 224 మంది పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, భైంసా, ఉట్నూరు డివిజన్లలో మొత్తం 642 వరకు పోస్టులు రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. ఇంతకాలం అటు ప్రత్యేకాధికారులు పర్యవేక్షణ లేక, ఇటు పంచాయతీ కార్యదర్శుల ఖాళీల భర్తీ చేయలేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. అనేక సవాళ్లు, సమస్యల మధ్య శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరిస్తున్న నూతన పాలకవర్గాలు పంచాయతీల్లో సవాళ్లను ఎదుర్కుంటారనేది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు