తండ్రి హత్య వెనుక తనయుడు

7 Jul, 2019 09:19 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ పీఎన్‌ బాబు

తండ్రి హత్యకు సుపారీ ఇచ్చిన తనయుడు 

కొడుకుతో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్‌ 

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. తండ్రి హత్యకు తనయుడే సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో కొడుకుతో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం డీఎస్పీ పీఎన్‌ బాబు తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన వారిలో గుత్తి మండలం తురకపల్లికి చెందిన నసరి వెంకటేష్, షేక్‌ షాను, గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన మహ్మద్‌ఖాన్‌ ఉన్నారు. జూన్‌ 27న గార్లదిన్నె మండలం కనుంపల్లి సమీపంలోని పొలాల్లో గోనెసంచిలో మూటకట్టేసిన గుర్తు తెలియని మృతదేహం వెలుగుచూసింది.

వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు గుత్తి మండలం తురకపల్లికి చెందిన నసరి అంకాలప్ప (40)గా గుర్తించారు. లోతుగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. అంకాలప్ప గుత్తికి చెందిన మరో మహిళతో పరిచయం పెంచుకొని సంపాదించిన మొత్తాన్ని ఆమెకే ఇచ్చేవాడు. కుమారుడు వెంకటేష్‌కు తెలియడంతో ఎలాగైనా తండ్రిని హత్య చేయాలని పథకం రచించాడు. దీంతో గుత్తికి చెందిన పరిచయస్తురాలు షేక్‌ షానుకు విషయం చెప్పాడు. ఇందుకు ఆమె అంగీకరించి తన సమీప బంధువైన నూర్‌ మహ్మద్‌ఖాన్‌కు రూ.20వేలకు సుపారీ ఇచ్చారు.

ఈ నెల 27 వెంకటేష్‌ తన తండ్రికి మాయమాటలు చెప్పి షాను ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ పథకం ప్రకారం గొంతుకు చున్నీ, కడ్డీతో బిగించి హత్య చేశారు. అనంతరం గోనెసంచిలో మూటకట్టి ఆటోలో గుత్తి నుంచి గార్లదిన్నె మండలం కనుంపల్లి సమీప పొలాల్లోకి తీసుకొచ్చి పడేసి వెళ్లారు. మరుసటి రోజు స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో వెలుగుచూసింది. ఎట్టకేలకు హత్య కేసులో నిందితులైన కుమారుడు వెంకటేష్, అతనికి సహకరించిన షేక్‌ షాను, మహమ్మద్‌ ఖాన్‌లను అరెస్ట్‌ చేశారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఆత్మకూరు సీఐ ప్రసాద్‌రావు, ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.    

మరిన్ని వార్తలు