ఆట.. ఏమైందో వేట

12 Aug, 2017 11:43 IST|Sakshi

►  క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో టీడీపీ నేతలకు మినహాయింపు!
► 25 రోజులుగా అజ్ఞాతంలోనే అధికార పార్టీ బుకీలు
► పోలీసులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు
► కేసును వైఎస్సార్‌ సీపీ నేతలపై నెడుతూ మైండ్‌గేమ్‌
► పోలీస్‌ కస్టడీకి కృష్ణసింగ్, మరో నలుగురు
► నేటినుంచి రెండోదఫా విచారణ


నెల్లూరు : జిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్‌ బెట్టింగ్‌ రాకెట్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కీలక బుకీలను శనివారం నుంచి పోలీస్‌ కస్టడీకి తీసుకుని మరోసారి విచారణ జరిపేందుకు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ సిద్ధమవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అధికార పార్టీలో మళ్లీ అలజడి మొదలైంది. ఇదిలావుంటే.. 25 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీడీపీ నేతలను పోలీసులు ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులపై అధికార పార్టీ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని.. మంత్రులు, ఎమ్మెల్సీలు స్వయంగా రంగంలోకి దిగి వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ సాగుతోంది.

మళ్లీ మొదలు
సమర్థవంతమైన అధికారిగా జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు పేరుంది. గతంలో ఆయన పనిచేసినచోట అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బెట్టింగ్‌ రాకెట్‌పై దృష్టి సారించారు. మూలాలతోసహా రాకెట్‌ గుట్టును రట్టు చేసి 115 మందిని మొదటి విడతలో అరెస్ట్‌ చేశారు. వీరిలో కీలక బుకీగా ఉన్న కృష్ణసింగ్‌తోపాటు మరో 8 మంది ప్రధాన బుకీలు, వారి అనుబంధంగా ఉండే 15 మందిపై నాన్ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.

పలు రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది బుకీలను, పంటర్లను సైతం అరెస్ట్‌ చేసి వారి పాత్ర ఏ మేరకు ఉందనేది నిర్ధారించారు. జిల్లాలో సీఐలు, డీఎస్పీలే బెట్టింగ్‌ రాకెట్‌ను పెంచి పోషించారనే వాదన బలంగా ఉంది. ఈ క్రమంలో వారి పాత్రను కూడా నిర్ధారించి ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలను వీఆర్‌కు పంపారు. ఆ తరువాత ఈ వ్యవహారంపై ఐదు రోజులపాటు స్తబ్దత నెలకొనగా.. తాజాగా కీలక బుకీలను పోలీస్‌ కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టనుండటంతో రాజకీయ నేతల్లో అలజడి రేగుతోంది.

ప్రధాన బుకీ కృష్ణసింగ్, షంషీర్, అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని విచారణ నిమిత్తం పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని శనివారం అధీనంలోకి తీసుకుని పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు సన్నద్ధమయ్యారు. బుకీల నుంచి ఎవరెవరికీ మామూళ్లు అందాయనే దానిపైనే కీలకంగా విచారణ సాగుతోంది. పోలీసు శాఖతోపాటు రాజకీయ మామూళ్లు, బుకీలకు అండదండలు అందిస్తున్న ముఖ్యనేతలకు సంబంధించిన వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.

ఇంకా పరారీలోనే..
ఇదిలా ఉంటే బెట్టింగ్‌ రాకెట్‌ విషయంలో మొదటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్న పోలీసులు బుకీలుగా ఉన్న ఇద్దరు టీడీపీ నేతలను అరెస్ట్‌ చేయకపోవడంపై అనేక అనుమానాలకు తెరలేచింది. తెలుగుదేశంపార్టీ మాజీ కౌన్సిలర్‌ దువ్వూరు శరత్‌చంద్ర, అతని కుమారుడు కీలక బుకీలుగా ఉన్నారు. మంత్రులు, మాజీ మంత్రులతో శరత్‌చంద్రకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత నెలలో మంత్రి నివాసంలో జరిగిన విందులో అన్నీ తానే అన్నట్టు కీలకంగా వ్యవహరించాడు.

శరత్‌చంద్ర, అతని కుమారుడు ఇద్దరూ నగరంలో కొన్నేళ్లుగా కీలక బుకీలుగా వ్యవహరిస్తూ కోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు. టీడీపీలో నామినెటేడ్‌ పదవి అనుభవిస్తున్న నేతకు ముఖ్య అనుచరుడైన బ్రహ్మనాయుడు కూడా కీలక బుకీగా వ్యవహరిస్తున్నాడు. బ్రహ్మనాయుడు రూ.లక్షల్లో బెట్టింగ్‌ నిర్వహించడంతోపాటు వందల మంది ద్వారా బెట్టింగ్‌ రాకెట్‌ను నడుపుతూ కీలక బుకీగా నగరంలో ఎదిగాడు. వీరంతా 25 రోజుల నుంచి పరారీలోనే ఉన్నారు. పోలీసు బృందాలు వీరి ఆచూకీ కోసం అన్వేషించినా దొరకని పరిస్థితి.

పరారీకి అధికార పార్టీ నేతలే పూర్తిస్థాయిలో సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పోలీసులపై కూడా అధికార పార్టీ నేతలు బలమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీరిని తప్పించడం కోసం బెట్టింగ్‌ రాకెట్‌ వ్యవహారం మొత్తాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపైకి నెట్టేలా అధికార పార్టీ నేతలు మైండ్‌ గేమ్‌కు తెరలేపారు. జిల్లాలో పార్టీ వ్యవహారాలను కీలకంగా చూస్తున్న ఎమ్మెల్సీ కనుసన్నల్లోనే బుకీలందరూ ఉన్నారన్నది బహిరంగ రహస్యమే.

కృష్ణసింగ్‌ మొదలుకొని బ్రహ్మనాయుడు వరకు అందరూ పెద్ద మొత్తాలను సదరు ఎమ్మెల్సీకి ముట్టజెప్పడం, వారిపై కేసులు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తేవడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలో బెట్టింగ్‌ రాకెట్‌ వేట కొనసాగుతున్న తరుణంలోనూ సదరు ఎమ్మెల్సీ మంత్రుల ద్వారా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అరెస్ట్‌లు అనివార్యమని పోలీసులు పరోక్షంగా చెప్పడంతో వారిద్దరినీ పరారీలోనే కొనసాగేలా చూస్తున్నారు.
 

మరిన్ని వార్తలు