సభాహక్కుల కమిటీకి ‘స్పీకరు ప్రెస్‌మీట్‌’

30 Mar, 2017 20:21 IST|Sakshi

అమరావతి: జాతీయ మహిళా సదస్సుపై స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రెస్‌మీట్‌ను వక్రీకరించిన మీడియాపై చర్యలకు సిఫార్సు కోసం ఈ అంశాన్ని సభా హక్కుల కమిటీకి పంపుతామని సభాపతి ప్రకటించారు. పవిత్రసంగమంలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు ఏర్పాట్లపై ప్రెస్‌మీట్‌లో స్పీకరు అనని మాటలను అన్నట్లుగా ‘సాక్షి’ మీడియా దుష్ప్రచారం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే అనిత గురువారం అసెంబ్లీలో ఆరోపించారు. పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజిలో ప్రధాన భూమిక పోషించిన మంత్రి నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విపక్షం చేసిన డిమాండుపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు అనిత పాత విషయాన్ని సభలో తెరపైకి తెచ్చారు.

 ఏది పడితే అది రాయడం ద్వారా సాక్షి గతంలో తనను కూడా అవమానించిందని ఆమె ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా సభాధ్యక్షుడిని కూడా అవమానించిన విషయాన్ని సభ్యులందరికీ చూపించేందుకు సభలో వీడియో ప్రదర్శించగా దానికి చూడకుండా ప్రతిపక్షం పారిపోయిందని ఆమె విమర్శించారు. అందువల్ల ఈ విషయంపై సిఫార్సు చేసేందుకు వీలుగా ఈ అంశాన్ని çసభాహక్కుల కమిటీకి సిఫార్సు చేయాలని ఆమె స్పీకరుకు నోటీసు ఇచ్చినట్లు సభలో ప్రకటించారు. అనిత ఇచ్చిన నోటీసు అందిందని, దీనిని సభా హక్కుల కమిటీకి పంపుతామని స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

మరిన్ని వార్తలు