Navayuga Kannagi Movie: పరువు హత్య, ప్రతీకారంపై సినిమా.. ఓటీటీకి వచ్చేది అప్పుడే!

25 Nov, 2023 11:40 IST|Sakshi

నాడు పాండియమన్నన్‌ అధర్మ తీర్పు కారణంగా కన్నగి తన భర్త కోవలన్నును కోల్పోయింది. ఆమె ప్రతీకారానికి మధురై దహనమైంది. అదే విధంగా ఇప్పుడు పరువు హత్యల కారణంగా తన ప్రేమికున్ని కోల్పోయిన స్వాతికి బలవంతంగా మరో పెళ్లి చేస్తే ఆ వివాహం తరువాత ఆమె ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకుందనే కాన్సెప్టే.. నవయుగ కన్నగి అని దర్శకుడు కిరణ్‌ దురైరాజ్‌ పేర్కొన్నారు.

ఇంతకుముందు పలు షార్ట్‌ ఫిలిమ్స్‌ చేసిన ఈయన తొలిసారిగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు కిరణ్‌ దురైరాజ్‌ తెలుపుతూ ఇందులో నటించిన వారంతా రంగస్థల నటీనటులని చెప్పారు. ముఖ్యంగా బెంగళూరులో నివసించే తమిళులని తెలిపారు. ఇది పలు యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రమని చెప్పారు. పరువు హత్యల గురించి ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చినా, వాటికి భిన్నంగా ఈ చిత్ర కథ ఉంటుందన్నారు.

ఇది ఏ కులాన్నో, మతాన్నో సమర్థిస్తూ రూపొందించిన కథా చిత్రం కాదని సమాజంలో జరుగుతున్న సంఘటనల వాస్తవ రూపమే నవయుగ కన్నగి అని చెప్పారు. కొందరి జాతి పిచ్చిని, వ్యతిరేకతను, వాటి వలన జరిగే హింసాత్మక సంఘటనలను పట్టించుకోని వారు తెలియని వారి మనస్తత్వాన్ని ప్రతిబింబించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చిత్రం షార్ట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిసెంబర్‌లో స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు దర్శక, నిర్మాత కిరణ్‌ దురైరాజ్‌ చెప్పారు.

చదవండి: ‘విక్రమ్‌ రాథోడ్‌’గా వస్తున్న విజయ్‌ ఆంటోనీ

మరిన్ని వార్తలు