నీరు, నిధులు..

31 Jan, 2015 03:32 IST|Sakshi
నీరు, నిధులు..

దృష్టి సారించకపోతే ఎస్కేయూ మనుగడకే ముప్పు
ఎస్కేయూ ఇన్‌చార్జ్ వీసీ చార్య లాల్ కిశోర్
 

సాంకేతిక విద్యలో 30 ఏళ్ల బోధనానుభవం.. విస్త­ృత పరిశోధనలతో కీలక నిర్ణయూలకు దోహదమైన మేధావి ఆచార్య కొండేపూడి లాల్‌కిశోర్. ప్రస్తుతం ఈయన జేఎన్‌టీయూ(అనంతపురం) వైస్ చాన్స్‌లర్ (వీసీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఎస్కేయూకూ ఇన్‌చార్జ్ వీసీగా వ్యవహరిస్తున్నారు. కచ్చితమైన నిర్ణయూలు తీసుకోవడంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఎస్కేయూలో కలియదిరుగుతూ ఏన్నో ఏళ్లుగా తిష్ట వేసిన సమస్యలపై విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు.

బోధన సిబ్బంది సమస్యలు, విద్యార్థుల ఇక్కట్లు, విభాగాధిపతుల కష్టాల గురించి ఆరా తీస్తూనే పలు సూచనలు చేశారు. వీసీనే స్వయంగా తమ కష్టాల గురించి ఆరా తీయడంతో కొన్ని సమస్యలైనా పరిష్కారానికి నోచుకుంట్యాని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, సిబ్బందితో వీసీ మాటామంతీ ఇలా..
 
లాల్ కిశోర్ :  అందరూ బాగున్నారా...

ఇంజినీరింగ్ విద్యార్థులు : బాగున్నాం సార్

లాల్ కిశోర్ : రాజ్యాంగం కల్పించిన హక్కులు, భాద్యతలు తెలుసా?

మౌనిక (బీటెక్ సివిల్ ఇంజనీరింగ్): ప్రజాస్వామ్యం పద్ధతి ప్రకారం నడవాలని రాజ్యాంగ నిర్మాతలు హక్కులతో పాటు బాధ్యతలను కూడా యిచ్చారు. హక్కుల గురించి పోరాడటంతో పాటు ప్రతి పౌరుడు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తే బాగుంటుంది.

లాల్ కిశోర్ : సివిల్ బ్రాంచ్ ఎందుకు తీసుకున్నావు?

మౌనిక : కోర్ బ్రాంచెస్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. భవిష్యత్‌లో సివిల్ ఇంజినీరింగ్‌కు డిమాండు అధికంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయనే నమ్మకం ఉంది.

లాల్ కిశోర్ : సివిల్స్‌కు ప్రిపేరవుతున్నావా?

సాయి శిరీష : అవును సార్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సాధించాలనే ధ్యేయంతో ఉన్నా.

లాల్ కిశోర్: కళాశాలలో బోధన ఎలా ఉంది?

ఝాన్సీ: టు బీ ప్రాంక్ చాలా బాగుంది సార్. నిరంతరం తరగతులు జరుగుతున్నాయి. నూతన విధానాలతో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. ప్రత్యేక చొరవ తీసుకుని ఫ్యాకల్టీ బాగా చెబుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

లాల్ కిశోర్ : ఇంజినీరింగ్ రంగంలో యువతకు భవిష్యత్తు ఎలా ఉందనుకుంటున్నారు?

అఖిల (సీఎస్‌ఈ): మారుతున్న కాలానుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సి ఉంది. ఇంటర్‌కు, బీటెక్ అకడమిక్ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఎక్కువగా డీవియేట్ కావడానికి అవకాశాలు ఎక్కువ. అధ్యాపకులు చెప్పే అంశాల కంటే స్వతహాగా నేర్చుకునే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. నిర్బంధ విద్య తరహాలో కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్య ఉండడంతో ఎక్కువగానే నేర్చుకున్నామని చెప్పాలి. బీటెక్‌లో ఎవరికి వారు స్వీయ నియంత్రణతో సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు పెంచుకుంటే అవకాశాలకు కొదవ ఉండదని నా అభిప్రాయం.

లాల్ కిశోర్ : ఇంజినీరింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి?

శ్రావణ్ కుమార్ రెడ్డి:  నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తాగడానికి కూడా నీళ్లు లేవు. ప్రత్యేకించి మరుగు దొడ్లు ఏ మాత్రం లేవు. అమ్మాయిలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి ఎద్దడితో ప్రతి ఏటా రెండు నెలలు ఆలస్యంగా తరగతులను నిర్వహించాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో సిలబస్ పూర్తికాకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోంది.

లాల్ కిశోర్ : ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి?

శ్రావణ్ కుమార్ రెడ్డి: కొత్తగా ఏర్పాటు చేశారు సార్.. తరగతులు బాగా నిర్వహిస్తున్నారు. అన్నీ బాగున్నాయి.

లాల్ కిశోర్ : హాస్టల్స్ ఎలా ఉన్నాయి?

రమ్య: పర్వాలేదు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది సార్..

లాల్ కిశోర్ : ఏఏ బుక్స్ చదువుతున్నావు?

చందన : లైబ్రరీ సదుపాయం ఉంది. లెక్చరర్స్ చెప్పిన పుస్తకాలతో పాటు లైబ్రరీ పుస్తకాలను చదువుతున్నాం.

లాల్ కిశోర్ : కోర్సు వర్క్ ఎలా ఉంది?

మౌనిక : కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదువుతున్నా. ప్రత్యేకించి బయట కంప్యూటర్ కోర్సులను నేర్చుకుంటున్నా. భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ప్రతి రోజు ఇంగ్లిష్ పేపరు చదువుతున్నా. దీంతో వర్తమాన అంశాలపై కూడా పట్టు ఏర్పడుతోంది.

ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో మొక్కలు నాటుతున్న విద్యార్థులను ఉద్ధేశించి లాల్ కిశోర్: ఎన్ ఎస్ ఎస్ క్యాంపు వల్ల ఉపయోగమేమిటీ? మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు?

సుగుణ బాబు: జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) విద్యార్థి దశలోనే జాతికి సేవ చేయడానికి కల్పించిన ఓ మహావకాశం. ఏ పౌరుడైనా తన మాతృదేశానికి సేవ చేస్తేనే రుణం తీర్చుకున్నవారవుతారు. విద్యార్థి దశ నుంచి సేవ అలవర్చుకోవడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మూడు రోజుల నుంచి చిన్నకుంట గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతున్నాం. వాటి సంరక్షణ పై ప్రచారం చేస్తున్నాం. ఎస్కేయూలో ప్రతి చెట్టుకు పాదులు తీసి ట్యాంకరు ద్వారా నీటి సరఫరా చేయిస్తున్నాము.

లాల్ కిశోర్: మొక్కలు నాటడం వల్ల ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు?

కుసుమ : చెట్లు నాటడం వల్ల వర్షాలు బాగా కురుస్తాయి. ప్రకృతి చేసిన ద్రోహం కంటే మానవ ఆకృత్యాలతో కృత్రిమ కరువును తెచ్చుకుంటున్నాము. ఈ వైఖరి మారాలి. ప్రతి ఒక్కరూ విధిగా చెట్లను పెంచాలి. మేము నాటే మొక్కను నాలుగేళ్లు సంరక్షించుకుంటే తర్వాత అదే పెరుగుతుంది. మేము మా ఇంటి వద్ద కూడా నలభై మొక్కలు నాటాము.
లాల్ కిశోర్ : ఓకే ఆల్ ది బెస్ట్.. మొక్కల పెంపకాన్ని ఇలాగే కొనసాగించండి.
ఫార్మసీ విభాగంలోని బోధన సిబ్బందితో లాల్ కిశోర్:  సిబ్బంది కొరత ఉందా?
వరలక్ష్మి (ఫార్మసీ లెక్చరర్): బీ.ఫార్మసీ విభాగం మొదట ఇంజనీరింగ్ విభాగం కింద ఉండేది. తర్వాత సొంతంగా బిల్డింగ్ సదుపాయం కలిగింది. అపుడు ముగ్గురు టీచింగ్ స్టాఫ్ ఉండేవాళ్లు .ప్రస్తుతం తొమ్మిది మంది ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల నుంచి ఫ్యాకల్టీకి జీతాలు పెంచలేదు.

ఫార్మసీ ఇన్‌ఛార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ హుస్సేన్‌రెడ్డితో లాల్ కిశోర్ : ప్రత్యేక పరికరాలు ఏమైనా ఉపయోగిస్తున్నారా?
 హుస్సేన్‌రెడ్డి : ల్యాబొరేటరీలో కొన్ని ప్రత్యేక పరికరాలు అమర్చాము. ఫార్మసీ విభాగానికి ఏఐసీటీఈ నుంచి గుర్తింపు పొందిన వర్సిటీలో ఇదే మొదటిది. కౌన్సిల్ ఫర్ ఫార్మసీ ఇండియా నుంచి కూడా గుర్తింపు పొందితే నిధులు బాగా వస్తాయి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్.. ఎం.ఫార్మసీని కూడా నిర్వహిస్తున్నాం.

లాల్ కిశోర్: విద్యార్థులను ఎలా సన్నధ్దం చేస్తున్నారు?

కిశోర్ (ఫార్మసీ లెక్చరర్) : ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో హెటిరో, రెడ్డీస్ ల్యాబ్ వంటి బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. విభాగానికి నిధులు కొరత ఉంది. ప్రాక్టకల్స్ నిర్వహించడానికి పక్క విభాగాల నుంచి పరికరాలు తీసుకోవాల్సి వస్తోంది. ప్రాక్టికల్స్ చేయలేనివి డెమో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మరింతగా ఫార్మసీ విభాగాన్ని ఆధునీకరించాల్సి ఉంది.

లాల్ కిశోర్: బి.ఫార్మసీ పూర్తయ్యూక ఏం చేయాలనుకుంటున్నారు?

అంజలి (బీ.పార్మసీ విద్యార్థి): జాబ్ చేయాలనుకుంటున్నా సార్..

లాల్ కిశోర్: ఫార్మసిస్ట్‌ల పాత్ర ఏమిటి?
ఎం.శిరీష : సమాజంలో ఫార్మసిస్టులది కీలకమైన పాత్ర. రోగాలకు ఔషధాలను కనుక్కోవాలి. నిరంతరం పరిశోధనలు కొనసాగించాలి. రాష్ట్ర విభజన తర్వాత కోస్తా ప్రాంతం కంటే రాయలసీమ ప్రాంతంతో ఫార్మా రంగం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కెమిస్ట్రీ విభాగాధిపతి ఆచార్య జే.శ్రీరాములతో లాల్ కిశోర్: ఎస్కేయూలో కెమిస్ట్రీ విభాగానికున్న ప్రత్యేకత ఏమిటి?

శ్రీరాములు :  ప్రతి ఏటా సీఎస్‌ఐఆర్ ఫెలోషిప్‌లకు ఐదు నుంచి 10 మంది ఎంపికవుతున్నారు. ఎస్‌ఏపీ, యూజీసీ ప్రాజెక్ట్‌లు మూడు నడుస్తున్నాయి. గతంలో 14 మంది బోధన సిబ్బంది ఉండేవాళ్లు. ప్రస్తుతం ఆ సంఖ్య ఎనిమిదికి పడిపోయింది. సిబ్బంది కొరత వేధిస్తోంది. పోస్టులు భర్తీ చేస్తే మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. సొంత డబ్బుతో కొన్ని వస్తువులను కొని ల్యాబ్‌లకు వాడుకునే పరిస్థితి ఏర్పడింది. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

లాల్ కిశోర్: ఎన్విరాన్‌మెంట్ స్టడీస్‌లో పరిశోధనలు ఏమైనా చేశారా?

సుధాకర్ బాబు (కెమిస్ట్రీ ప్రొఫెసర్): రాయలసీమలో ఏర్పడిన కాలుష్యంపై ప్రత్యేక పరిశోధనలు చేశాము. సాయిల్ అనాలసిస్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాము. కెమిస్ట్రీ విభాగం నుంచి చదివి ఎంతో మంతి అత్యున్నతమైన స్థానాల్లో కొనసాగుతున్నారు.

లాల్ కిశోర్: నూతన ఆవిష్కరణల గురించి..

ఎల్.కే.రవీంద్రనాథ్ (కెమిస్ట్రీ బీఓఎస్ చెర్మైన్):  ఈ విభాగం నుంచి 300 పీహెచ్‌డీలు ప్రదానం చేశాం సార్. 1500 పబ్లికేషన్స్‌ను ముద్రించాము. బోధన సిబ్బంది కొరత ఉంది. దీనికి తోడు ఛాయిస్ బేస్డ్ సిస్టమ్ విధానానికి మరింత మంది ఫ్యాకల్టీ అవసరం ఏర్పడింది. మామ్ వంటి ప్రాజెక్ట్‌ల రూపకల్పనలో ఇక్కడి పూర్వ విద్యార్థుల సహకారం ఉంది.

లాల్ కిశోర్: ఎస్కేయూలో నీటి సమస్యను తీర్చడానికి ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా ఉన్నాయా?

లింగారెడ్డి(వైఎస్సార్ విద్యార్థి విభాగం

కార్యదర్శి): వర్సిటీలో నీటి ఎద్దడిని నివారించడానికి పీఏబీఆర్ డ్యాం నుంచి నీటిని సరఫరా చేరుుంచాలి సార్.. ఈ సమస్యతో ప్రతి ఏటా అకడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవుతోంది. వందలాది భోదన, భోదనేతర ఉద్యోగాలు భర్తీకి నోచుకోలేదు. వీటిని భర్తీ చేస్తే విద్యలో నాణ్యత పెంపొందుతుంది.
 
ఎస్కేయూలో తాగునీటి ఎద్దడి తీవ్రతరం

ఎస్కేయూలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆలోచించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్సిటీ మనుగడకే ప్రమాదకరమైన నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి. బీటెక్ కోర్సులను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. బీ-ఫార్మసీ విభాగానికి నిధులు పెంచాలి. వర్సిటీలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలి. - ఎస్కేయూ ఇనచార్జ్ వీసీ ఆచార్య కె. లాల్‌కిశోర్

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా