రెండు నెలల్లో లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టు

27 Feb, 2015 02:03 IST|Sakshi

 లక్ష్మీపేట(వంగర) :  లక్ష్మీపేట గ్రామంలో రెండు నెలల్లో ప్రత్యేక కోర్టు ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సీబీసీఐడీ విభాగం డీఐజీ ఆలూరి సుందర్‌కుమార్‌దాస్ వెల్లడించారు. 2012 జూన్ 12వ తేదీన ఇరువర్గాల మధ్య జరిగిన మారణహోమంలో ఐదుగురు దళితులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పోలీస్ పికెట్ పాయింట్లను పరిశీలించి శాంతిభద్రతలపై ఆరా తీశారు. ప్రత్యేక కోర్టు నిర్వహణకు అవసరమైన నిధుల మంజూరుకు మార్గం సుగుమం కావడంతో ఏప్రిల్, మే నెలల్లో కోర్టు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 14 ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులున్నాయని..వీటి ద్వారా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విభాగంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం దళిత బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రేషన్, పింఛన్, గృహనిర్మాణ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. స్పందించిన డీఐజీ రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబుతో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు డీఐజీ దళిత బాధిత కుటుంబాలకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు దేవానంద్‌శాంతో, సీహెచ్ పెంటారావు, సీఐ ఎంవీవీ రమణమూర్తి, ఎస్‌ఐ భాస్కరరావు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు