స్పెషలిస్టు వైద్యుల భర్తీ

2 Mar, 2015 02:28 IST|Sakshi

వారంలోగా నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వారంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు, వైద్య విధాన పరిషత్‌లోని ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలకానుంది. 80 శాతం వైద్య కళాశాలల్లో 30 శాతం అధ్యాపకుల కొరత ఉన్నట్టు తేలింది. దీంతో ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణ(రెన్యువల్) ప్రక్రియకు ఎంసీఐ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వారంలో పోస్టులను  భర్తీ చేయాలని నిర్ణయించినట్టు వైద్య విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
 
340 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. ఈ కళాశాలల్లో 340 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను గుర్తించారు. వివిధ విభాగాల్లో పీజీ పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులు. ఒక్కో అభ్యర్థి నుంచీ దరఖాస్తుకు రూ.1000 వసూలు చేస్తారు. వైద్య విధానపరిషత్, డెరైక్టర్ ఆఫ్ హెల్త్ విభాగాల్లో పనిచేస్తూ పీజీ వైద్య విద్య పూర్తిచేసిన 250 మందిని లాటరల్ ఎంట్రీ పేరుతో ఇన్‌సర్వీస్ అభ్యర్థులను భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ ఇస్తున్నది కేవలం కొత్త అభ్యర్థులకు మాత్రమే. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 8 వేల మంది పీజీ  చేసి నిరుద్యోగులుగా ఉన్నట్టు అంచనా.
 
200 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు
వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉన్న ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో 200కు పైగా సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్) పోస్టులను నియమించాలని నిర్ణయించారు.
 
తొలిసారి ఆన్‌లైన్‌లో భర్తీ
గతంలో జరిగిన అక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ మారు వైద్య విద్యాశాఖ ఆన్‌లైన్‌లో పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి ఎన్‌ఐసీ(నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్) ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.

మరిన్ని వార్తలు