పెళ్లికి.. దయచేయండి...

17 Jul, 2020 11:28 IST|Sakshi

పెళ్లిళ్లకు కరోనా చిక్కులు 20 మందికే ఆహ్వానం

21 నుంచి శ్రావణ మాసం

తాజాగా తహసీల్దార్లకు అనుమతి మంజూరు అధికారాలు

ప్రొద్దుటూరు : రండి..రండి.. దయచేయండి.. అంటారు..ఇదో రకమైన ఆహ్వానం.. ఇక మీరు దయచేయవచ్చు..అంటారు కొందరు..అంటే మీరు వెళ్లవచ్చు..అని పరోక్ష అర్ధం ధ్వనిస్తుంది. కరోనా సమయంలో పెళ్లిళ్ల ఆహ్వానాల పరిస్థితి అలానే తయారైంది. సమూహంగా ఏర్పడితే కరోనా వైరస్‌ సోకే ప్రమాదముంటుందనే హెచ్చరికల నేపథ్యంలో పెళ్లిళ్లు లాంటి శుభ లేదా అశుభ కార్యక్రమాలు నిర్వహించడం చాలావరకూ మానుకుంటున్నారు. కొందరు తప్పని సరి పరిస్థితుల్లో నిర్వహించినా అధికారుల అనుమతి పొందాల్సి ఉంటుంది. అది కూడా కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలని నిబంధన విధిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది అనివార్యం కూడా. 20మంది అనే సరికి ఎవరిని పిలవకుండా ఊరుకోవాలో తెలియక నిర్వాహకులు సతమతం అవుతున్నారు. 

పిలవకపోతే ఏమనుకుంటారో అనే ఫీలింగ్‌..ఇదిలా ఉంటే మరోకోణంలో పెళ్లికి పిలుస్తారేమోనని అటువైపు భయపడుతున్నారు. పిలవకుండా ఉంటే బాగుణ్ణు అని కూడా అనుకుంటున్నారు. కాగా ఇప్పటివరకూ కార్యక్రమాలకు అనుమతి జిల్లా కలెక్టరేట్‌ నుంచి పొందాల్సివచ్చేది. దీనివల్ల జాప్యం అవుతోంది. దీంతో మండల పరిధిలో తహసీల్దార్లకే బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 21వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో పెద్ద సంఖ్యలో వివాహాలు నిర్వహించుకోవడానికి బంధువులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‌కింది స్థాయిలోనే పెళ్లిళ్లకు అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇస్తామని ప్రొద్దుటూరు తహసీల్దారు జె.మనోహర్‌రెడ్డి తెలిపారు. మిగతా శుభకార్యాలకు ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం కేవలం 20 మందికి మాత్రమే తహసీల్దార్‌ అనుమతి ఇస్తారు.
పెళ్లి కుమార్తె, పెళ్లికుమారుడికి సంబంధించి ఇరువైపులా కలిపి ఈ సంఖ్యను మాత్రమే అనుమతించనున్నారు.
వివాహ ఆహ్వాన పత్రికతోపాటు అనుమతి కోరేవారు రూ.10 నాన్‌ జ్యుడీషియల్‌స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దార్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
ముందుగా దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్‌ కార్డులతోపాటు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వైద్యులు ఇచ్చినపత్రాలను జత చేయాలి.
నిబంధనలను ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్‌–188 ద్వారా కఠిన చర్యలు తీసుకుంటారు.

మరిన్ని వార్తలు