మాస్టర్‌ప్లాన్ అమలుకు శ్రీకారం

29 Oct, 2014 03:18 IST|Sakshi
మాస్టర్‌ప్లాన్ అమలుకు శ్రీకారం

నగరంలో రోడ్లు విస్తరణకు సర్వే

 నెల్లూరు(నవాబుపేట): మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా నెల్లూరులో ప్రధాన రహదారుల విస్తరణకు కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులను మంగళవారం నుంచి ప్రారంభించారు. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ నుంచి బోసుబొమ్మ, ట్రంకురోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు 100 అడుగుల రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ నుంచి కేవీఆర్, కరెంట్ ఆఫీస్, వేదాయపాళెం మీదుగా అయ్యప్పగుడి వరకు 150 అడుగులు రోడ్డు, అయ్యప్పగుడి నుంచి బీవీనగర్ మీదుగా మినీబైపాస్‌రోడ్డు వరకు 200 అడుగులు మేర రోడ్లు విస్తరణ చేపట్టనున్నారు. సుమారు 16 కిలోమీటర్లు మేరకు రోడ్లు విస్తరణ జరగనుంది.

పెరుగుతున్న జనభా, వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలగకుండా మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదనలు రూపొందించారు. చాలా కాలంగా దీని అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఈ ప్రతిపాదనలకు దుమ్ముదులిపారు. సర్వే పనులు ప్రారంభించడం ద్వారా విస్తరణ పనులకు తొలి అడుగు పడినట్టయింది. 1978లో నగరానికి సంబంధించి అప్పటి మున్సిపల్ అధికారులు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు.

నగర అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంటూ ప్రతి పదేళ్లకోసారి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో ఎట్టకేలకు 2013లో  మాస్టర్‌ప్లాన్‌కు మెరుగులు దిద్దారు. ప్రస్తుతం దాని అమలుకు కార్యాచరణలోకి దిగారు. ఇందుకోసం ఆరుగురు సభ్యులతో కూడిన ఒక బృందాన్ని కార్పొరేషన్ నియమించింది.

ఈ బృందంలో ఇద్దరు సర్వేయర్లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, టౌన్ సర్వేయర్, సిటీ సర్వేయర్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. అయ్యప్పగుడి సమీపం నుంచి రోడ్డు విస్తరణకు సంబంధించిన సర్వేకు శ్రీకారం చుట్టారు. రెండు వారల్లో ఈ సర్వే పూర్తి కావచ్చని భావిస్తున్నారు. ఇదంతా ఒక కొలిక్కి వచ్చిన తరువాత  ఏయే ప్రాంతాల్లో ఎంతెంత భూ సేకరణ అవసరమవుతుందనేది కూడా తెలుస్తుంది. ఆ మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుంది.

 ట్రాఫిక్ కష్టాల నుంచి ఊరట
 మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా రోడ్డు విస్తరణ జరిగనట్లయితే నెల్లూరు నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నగరంలోని గాంధీబొమ్మ కూడలి, అంబేద్కర్ సర్కిల్, మద్రాసు బస్టాండు, ఆర్‌టీసీ, కేవీఆర్ పెట్రోలు బంకు, వేదాయపాళెం, ముత్తుకూరు గేటు సెంటర్, తదితర ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇదంతా ఒక రోజులో జరిగే పని కానప్పటికీ ఎట్టకేలకు సర్వే ప్రారంభించడంతో కొంతైనా కదలిక వచ్చిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు