న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం.. 

6 Nov, 2023 06:13 IST|Sakshi

మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలుకు భారత్‌ జాగృతి న్యాయపోరాటం: కవిత

సాక్షి, హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్‌ జాగృతి న్యాయపోరాటం చేయనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, వారి సలహా మేరకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లో భారత్‌ జాగృతి తరఫున ఇంప్లీడ్‌ అవుతామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

తాము పోరాడి సాధించిన మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయించడానికి కూడా మరో పోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలుకు పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయని, ఈ మేరకు ఇప్పటికే పలు సంస్థలు కోర్టుకు వెళ్లాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి, 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు