ఏపీలో పథకాల అమలు భేష్‌ 

27 Aug, 2023 05:32 IST|Sakshi
రెడ్డిపల్లి సచివాలయాన్ని సందర్శించిన పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ కనిమొళి బృందం  

 పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ కనిమొళి 

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరు ప్రశంసనీయంగా ఉందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ కనిమొళి కరుణానిధి అభినందించారు. కనిమొళి అధ్యక్షతన 11 మంది ఎంపీలతో కూడిన బృందం విశాఖ జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో శనివారం పర్యటించింది.

కేంద్ర నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించారు. శొంఠ్యాంలోని రామ్‌సాగర్‌ అమృత్‌ సరోవర్‌ ట్యాంకుతోపాటు, చందక గ్రామంలో వ్యవసాయ భూరీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. పద్మనాభం మండలం రెడ్డిపల్లి సచివాలయంలో అందుతున్న సేవల గురించి ఆరా తీసింది. వివిధ గ్రామాలకు చెందిన స్వయం సహాయక బృందాల సభ్యులతో మాట్లాడి పథకాల అమలు తీరుపై ఆరా తీశారు.   

సచివాలయాల సేవలు అద్భుతం 
అనంతరం నగరంలోని ఓ హోటల్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన సంస్థ విభాగాలకు సంబంధించిన జిల్లా అధికారులు, యూనియన్‌ బ్యాంక్, స్టేట్‌ బ్యాంక్‌ అధికారులతో శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుని ప్రశంసించారు. సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సభ్యులు మాల రాజ్యలక్ష్మీషా, అజయ్‌ ప్రతాప్‌సింగ్, తలారి రంగయ్య, నరాన్‌భాయ్‌ జె.రత్వా, ఏకేపీ చిన్‌రాజ్, రాజీవ్‌ దిలేర్, మహ్మద్‌ జావెద్, వాజేసింగ్‌భాయ్‌ రత్వా, ఇరన్నా కడాది, నరేంద్రకుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు