డిగ్రీ ప్రయోగ పరీక్షలు ప్రారంభం

12 Apr, 2016 00:48 IST|Sakshi
డిగ్రీ ప్రయోగ పరీక్షలు ప్రారంభం

శ్రీకాకుళం న్యూకాలనీ: డిగ్రీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు సెకెండ్ సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు సోమవారం ఆరంభమయ్యాయి. డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో జిల్లాలో ఏడు రీజియన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు,  మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం పురుషుల కళాశాల పరిధిలో 14 కళాశాలలు, శ్రీకాకుళం మహిళలు-13, నరసన్నపేట-12, కాశీబుగ్గ (ఎస్‌బీఎస్‌వైఎం డిగ్రీ కళాశాల)-16, ఇచ్ఛాపురం-10, పాలకొండ-15,  రాజాం(జీసీఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల) పరిధిలో 11 కళాశాలలు ఉన్నాయి.

ఇందులో కాశీబుగ్గ, రాజాం మినహా మిగిలిన రీజనల్ కేంద్రాలన్నీ ప్రభుత్వ కళాశాలలే. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లే చీఫ్ సూపరింటెండెంట్‌లుగా వ్యవహరిస్తుండడంతో చూసిరాతలు జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కళాశాలల్లో ఎక్స్‌ట్రనల్ ఎగ్జామినర్లను ఓ గదిలో కూర్చోబెట్టి సపర్యలు చేసి చూసిరాతను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై వర్సిటీ పరీక్షల అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
 
అసౌకర్యాల నడుమ పరీక్షలు..

కొన్ని కళాశాలల్లో ప్రయోగ పరీక్షలను విద్యార్థులు అసౌకర్యాల నడుమ రాస్తున్నారు. సరైన సదుపాయాలు, పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్‌లలో నేలపైనే కూర్చొని పరీక్షలు రాసారు.

మరిన్ని వార్తలు