ట్రాఫిక్ స్టేషన్లు.. మరో రెండు | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ స్టేషన్లు.. మరో రెండు

Published Tue, Apr 12 2016 12:47 AM

The other two stations are traffic ..

ప్రభుత్వం నుంచి అనుమతి కమిషనరేట్‌లో కసరత్తు రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి
ట్రాఫిక్ పర్యవేక్షణకు డీసీపీ అధికారి కొత్తగా 183 మంది కానిస్టేబుళ్లు

 

విజయవాడ : విజయవాడ కమిషనరేట్‌లో మరో రెండు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. పెరిగిన వాహనాల సంఖ్య, విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్‌లో మరో రెండు స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రావడంతో స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు మొదలు పెట్టారు. విజయవాడ కమిషనరేట్‌ను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా అదనంగా సిబ్బందిని కేటాయించారు. వారిలో 183 మందిని ట్రాఫిక్‌కు వినియోగించుకోనున్నారు. మరో రెండు నెలల కాలంలో మొత్తం ప్రక్రియను పూర్తి చేసి నగరంలో ఆరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లతో పర్యవేక్షించనున్నారు.

 
నాలుగు స్టేషన్ల నుంచి ఆరుకు పెంపు..
.
విజయవాడ కమిషనరేట్ రెండేళ్ల క్రితమే అప్‌గ్రేడ్ అయ్యింది. కేవలం కమిషనర్ కేడర్‌ను మాత్రమే అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం మౌలిక సదుపాయాలు సహా మిగిలిన అన్ని విషయాలను పెండింగ్‌లో ఉంచింది. ఈ క్రమంలో గత వారంలో కమిషనరేట్ బలోపేతానికి ప్రత్యేక జీవో జారీ చేసింది. అదనపు కమిషనర్, జాయింట్ కమిషనర్లు సహా 471 మంది సిబ్బందిని కమిషనరేట్‌కు కేటాయించింది. ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ వ్యవహారాలను ఏడీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. నగరంలో సూర్యారావుపేట, పటమట, సత్యనారాయణపురం, ఆటోనగర్‌లో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్లకు సీఐలు అధికారులుగా కొనసాగుతూ, నాలుగు ష్టేషన్ల ద్వారా నగరమంతా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో శివారులను కలుపుకొని నగరం విస్తరించడంతో నాలుగు స్టేషన్ల పరిధిలో మార్పులు చేర్పులు చేసి ఆరు స్టేషన్లుగా మార్చనున్నారు.

 
ఒత్తిడి తగ్గించేందుకే...

ట్రాఫిక్‌కు సంబంధించి నగరంలో రెండు సబ్‌డివిజన్లను ఏర్పాటు చేసి ఇద్దరు ఏసీపీలను నియమించనున్నారు. నగరం రాజధాని అయిన క్రమంలో సీఎం సహా వీఐపీల తాకిడి బాగా పెరిగింది. దీంతో ఉన్న కొద్దిపాటి సిబ్బందిలో 80 శాతం మంది వీఐపీ డ్యూటీలోనే నిమగ్నమై రూట్ క్లియర్ చేసే పనిలోనే నిత్యం బిజీగా గడుపుతున్నారు. దీంతో పోలీసులపై ఒత్తిడి అధికమైంది. ఈ క్రమంలో అదనంగా 183 మంది కానిస్టేబుళ్లను కేటాయించారు. కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ లేకపోవడంతో ఇతర రేంజిలు, బెటాలియన్ల నుంచి డిప్యుటేషన్లపై కమిషనరేట్‌కు సిబ్బందిని తీసుకోనున్నారు. డిప్యుటేషన్ నియామకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కమిషనరేట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.


బందరు రోడ్డే కీలకం...
ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులకు బందరు రోడ్డు వీఐపీ జోన్‌గా మారింది. దీంతో బందరు రోడ్డులోనే అధిక శాతం మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో నిమగ్నమవుతున్నారు.  రామవరప్పాడు రింగ్ మొదలుకొని సీఎం కార్యాలయం వరకు దాదాపు 80 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా బందరు, ఏలూరు రోడ్లలో ట్రాఫిక్ రద్దీ ఉదయం నుంచి రాత్రి పదింటి వరకూ కొనసాగుతోంది. స్టేషన్ల విభజన సమయంలో బందరు రోడ్డును కీలకంగా తీసుకుని ప్రత్యేకంగా ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. సీఎం సహా వీవీఐపీల రూట్ క్లియరెన్సుల కోసం మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసే యోచనలో కమిషనరేట్ అధికారులు ఉన్నారు. ఇప్పటికే రెండు స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి సిబ్బంది సంఖ్యతో కసరత్తు చేస్తున్నారు. జూన్ మొదటి వారం కల్లా స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఐపీఎస్‌ల బదిలీల్లో కమిషనరేట్‌కు కొత్తగా కేటాయించే ఐపీఎస్‌కు ట్రాఫిక్ డీసీపీగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement