ఈ నెల 8న రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు

1 Jun, 2019 04:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉదయం 11.39 గంటలకు సచివాలయం వద్దే మంత్రివర్గం ప్రమాణం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అంతేవేగంతో పాలనాపరమైన అంశాలతో పాటు ప్రజలకిచ్చిన నవరత్నాల హామీలు నెరవేర్చడంపై దృష్టిసారించారు.  ఈ నెల 8వ తేదీన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. ఆ రోజు ఉదయం 11.39 గంటలకు సచివాలయం దగ్గరే మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

వర్షం వచ్చినా సమస్య లేకుండా ఉండేలా వేదికను ఏర్పాటు చేయాలని అధికారవర్గాలకు సంకేతాలందాయి. అసెంబ్లీ సభ్యుల ఆధారంగా నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రితో పాటు 26 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే పూర్తి స్థాయిలో అంతమందితో మంత్రివర్గం ఏర్పాటుచేస్తారా.. లేదా తొలుత కొంతమందితో ఏర్పాటుచేసి, ఆ తర్వాత విస్తరణ చేపడతారా.. అనేది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణాధికారంగా ఉంటుంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టిసారించారని.. ఏ జిల్లాలో ఎవరికి స్థానం కల్పించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. 

8.39 గంటలకు సచివాలయంలోకి అడుగుపెట్టనున్న సీఎం జగన్‌
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వైఎస్‌ జగన్‌ 8వ తేదీ ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోకి వెళ్లనున్నారు. ముహూర్తం మేరకు సచివాలయంలోని ఒకటో బ్లాకు తొలి అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయంలోకి ఆయన ప్రవేశించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న విదేశాలకు చెందిన, సింగపూర్‌కు చెందిన గ్రాఫిక్స్‌ బొమ్మలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు