ఓట్లు తొలగిస్తే వేటు తప్పదు

22 Feb, 2019 02:13 IST|Sakshi

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టీకరణ  

కావాలని తప్పులు చేస్తే  క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం.. 

ఇప్పటికే పలువురు సిబ్బందిపై చర్యలు చేపట్టాం.. 

ఒక జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ముగ్గురు తహసీల్దార్లకు హెచ్చరికలు జారీ చేశాం  

రాష్ట్రంలో 1.55 లక్షల ఓట్లు రెండుచోట్లా నమోదైనట్లు గుర్తించాం

ఓటర్ల నమోదుకు 23, 24 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు 

కొత్త ఓటర్లకు మార్చి 10వ తేదీలోగా గుర్తింపు కార్డులు

సాక్షి, అమరావతి: ఓటర్‌ జాబితా నుండి అకారణంగా ఓటర్ల పేర్లు తొలగిస్తే సంబంధిత అధికారులపై వేటు తప్పదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితా తయారీలో తప్పులు చేసిన పలువురు సిబ్బందిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే ఒక జిల్లా కలెక్టర్, ఒక డిప్యూటీ కలెక్టర్, ముగ్గురు తహసీల్దార్లకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు కావాలని తప్పులు చేస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకతతో పని చేస్తామని అన్నారు. తమ అనుమతి లేకుండా కలెక్టర్లు కూడా ఓట్లు తొలగించలేరని ద్వివేది చెప్పారు. ఓటర్ల జాబితాలో 0.1 శాతం కంటే ఎక్కువ తేడాలు ఉంటే కలెక్టర్లు ప్రధాన ఎన్నికల అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ఓటర్ల జాబితాలో ఓటర్లు తమ పేర్లు ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఓటర్ల నమోదు ప్రక్రియ అభ్యర్థి నామినేషన్‌ వేసే ముందు రోజు వరకూ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఈ నెల 23, 24వ తేదీల్లో ఓట్ల నమోదు, ఓటర్ల జాబితాలో పేర్లు పరిశీలించుకునేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఆయా తేదీల్లో బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు అన్ని ఫారాలతో అందుబాటులో ఉంటారు. ఓటు ఉందా? లేదా? అనేది పరిశీలించుకోవచ్చు. కొత్తగా ఓటర్‌ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లను ప్రత్యేక క్యాంపుల వద్ద నియమించుకోవాలి. కొత్తగా ఓటర్‌ నమోదు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 10వ తేదీ నాటికి ఇంటింటికీ వెళ్లి ఓటర్‌ గుర్తింపు కార్డులు అందజేస్తాం. 

నోటీసు ఇవ్వకుండా ఓట్లు తొలగించొద్దు 
రాష్ట్రంలో జనవరి 11వ తేదీ నాటికి 3.69 కోట్ల ఓట్లు ఉన్నాయి. వీటిలో 1.55 లక్షల ఓట్లు రెండుసార్లు నమోదైనట్లు గుర్తించాం. మరో 13,000 ఓట్లలో పలు తప్పులు దొర్లాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాలో ఓటు ఉన్న వారి విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో సర్వేలపై ఎలాంటి నిషేధం లేదు. సర్వేల పేరిట ఓట్లు తొలగించడం అసాధ్యమే. ఓటర్ల తుది జాబితా తయారయ్యాక ఓట్లు తొలగించడానికి అవకాశం లేదు. నోటీసు ఇవ్వకుండా ఒక్క ఓటు కూడా తొలగించడానికి వీల్లేదు. ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల తొలగింపుపై ఫిర్యాదులు అందడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ నుంచి మూడు బృందాలను రాష్ట్రానికి పంపింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఈ బృందాలు పర్యటించి, ఓటర్ల జాబితాలపై పరిశీలన చేస్తాయి. 13 జిల్లాల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను(ఈవీఎం) సిద్ధం చేస్తున్న ప్రక్రియను వెబ్‌ కెమెరాల ద్వారా చిత్రీకరించి, ప్రత్యక్షంగా చూసేలా సచివాలయం ఐదో బ్లాకులో ఏర్పాట్లు చేశాం’’ అని గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.  

ఓటర్ల నమోదుకు సహకరించండి 
ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న క్యాంపుల వద్ద రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను నియమించి, ఓటర్ల నమోదుకు సహకరించాలని గోపాలకృష్ణ ద్వివేది కోరారు. ఆయన గురువారం వెలగపూడిలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన సందేహలను నివృత్తి చేసి, పరిష్కరించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని తెలిపారు. పార్టీల ప్రతినిధులు వ్యక్తం చేసే అభ్యంతరాలను కూలంకుషంగా పరిశీలిస్తామన్నారు. టీచర్‌/గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం నమోదుకు అర్హత గల ఓటర్లుకు నామినేషన్‌ దాఖలు చేసే చివరి రోజు వరకూ అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఓటరు నమోదుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరారు. డూప్లికేట్‌ ఓట్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబం నుంచి ఒక వ్యక్తి వారి కుటుంబ సభ్యులకు చెందిన ఓటరు నమోదు దరఖాస్తులను తీసుకొస్తే బూత్‌ లెవెల్‌ అధికారి ఎలాంటి అభ్యంతరం తెలపకుండా స్వీకరించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓలు సుజాత శర్మ, వివేక్‌ యాదవ్, జాయింట్‌ సీఈఓ మార్కండేయులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు మల్లాది విష్ణు, వి.శ్రీనివాసరావు, సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి, ఎమ్‌.రాజేంద్ర, వై.వెంకటేశ్వరరావు,  జెల్లీ విల్సన్, జె.రంగబాబు, వి.సత్యమూర్తి పాల్గొన్నారు.  

గోపాలకృష్ణ ద్వివేదికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు 
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో 9,872 ఓట్లు తొలగించారని శాసన మండలిలో ప్రతినేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ గురజాల ఇన్‌చార్జి కాసు మహేష్‌రెడ్డి గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే ఓట్ల తొలగిస్తున్నారని ఆరోపించారు. కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. గురజాల నియోజకవర్గంలో కొందరు సీఐలు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పినట్లు తల ఊపుతూ వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమంగా నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తున్నారని, దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ నాయకులు ఓటర్ల అనుమతి లేకుండానే ఫారం–7ను ఆన్‌లైన్‌లో ఇస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశామన్నారు.   

మరిన్ని వార్తలు